Investment in Semiconductor Sector: రాయలసీమ పారిశ్రామిక హబ్‌గా మారనుంది. కర్నూలు సిగలో మరో కలికితురాయి చేరనుంది. దేశానికే తలమానికమైన సెమీకండక్టర్ పరిశ్రమ ఓర్వకల్లు పారిశ్రామికహబ్‌లో ఏర్పాటు కానుంది. వేల కోట్ల పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనుండటంతో జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
రాయలమసీమలో పారిశ్రామిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. ఉపాధి లేక వలసబాటపట్టిన ప్రాంతాల్లో వేలాది కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామికవాడలో ఇప్పటికే జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్, డీఆర్డీఏ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లు రాగా, తాజాగా దేశానికే తలమానికమైన సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. సుమారు 14వేల కోట్ల పెట్టుబడితో జపాన్, భారత్ ఐటీ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జపాన్‌కు చెందిన సంస్థ ప్రతినిధులు పారిశ్రామికవాడను సందర్శించి మౌలిక సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
సుమారు 130 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న సెమీ కండక్టర్ పరిశ్రమతో ప్రత్యక్షంగా రెండువేల మందికి, పరోక్షంగా 10వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా రెండున్నరేళ్లలో పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. జనవరి రెండో వారంలో అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ పరిశ్రమ ఏర్పాటైతే దేశంలోనే అతి పెద్ద సెమీ కండక్టర్ పరిశ్రమగా రికార్డు సృష్టించనుంది.