Tirumala Srivani Trust Darshan Tickets Problems : శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. రోజు తిరుమల గోకులం కార్యాలయంలో 800 కోటా టికెట్లను టీటీడీ జారీచేస్తుండటంతో భారీగా క్యూలైన్ పెరుగుతోంది. 10 రోజులుగా మధ్యాహ్నం ఒంటి గంటకే శ్రీవాణి ట్రస్టు టికెట్ల జారీ ప్రక్రియ పూర్తవుతోంది. రూ.10,500కు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లను టీటీడీ జారీ చేస్తొంది. సాధారణంగా ఉదయం ఎనిమిదన్నరకు కౌంటరులో టికెట్ల జారీని మొదలు పెడతారు. వీటి కోసం ఉదయం 6 గంటల నుంచే భక్తులు క్యూలైన్ వద్దకు చేరుకుని పడిగాపులు కాస్తుంటారు. అయితే శ్రీవాణి టికెట్లు కావాల్సిన భక్తులు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కౌంటరులోకి వెళ్లి టికెట్లు పొందాల్సి ఉంది. క్యూలైన్లలోకి చంటి పిల్లలను సైతం తీసుకొని వెళ్లాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లకు విపరీతంగా ఆదరణ పెరిగి ఒంటి గంట తర్వాత టికెట్లు లేకపోవడంతో భక్తులు నిరాశతో వెనుతిరుగుతున్నారు.
తిరుమల విజన్-2047 పై సమీక్ష.. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనలో భాగంగా ఆరు నెలల్లో పది శాతం మాత్రమే చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. ప్రక్షాళనలో భాగంగా స్వర్ణాంధ్ర విజన్- 2047లో అనుగుణంగా తిరుమల విజన్-2047తో టీటీడీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి స్థానిక అన్నమయ్య భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు సామాన్య భక్తులకు పెద్ద పీట వేయాలని ఆదేశించారని, దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. తాను ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లడ్డూ ప్రసాదంలో నెయ్యి నాణ్యతను గుర్తించానన్నారు. ప్రస్తుతం స్వామివారికి సమర్పించే ప్రసాదాలు, లడ్డూ ప్రసాదంకు వినియోగించే నెయ్యి స్వచ్చమైన ఆవు నెయ్యినన్నారు.
రూ.70 వేలు వసూలు చేసి రూ.300 దర్శనం - తిరుమలలో కానిస్టేబుల్ మోసం
వెంకమాంబ అన్న వితరణ కేంద్రంలో భక్తులకు స్వీకరించే భోజనాల్లో నాణ్యత పెంచామని ఈవో శ్యామలరావు తెలిపారు. అలాగే శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో భక్తులు వేచి ఉండే సమయం తగ్గించామని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపామని వెల్లడించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించామన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి యాత్ర ఒక మంచి అనుభూతిని ఇచ్చేలా మంచి కార్యక్రమాలు చేస్తామన్నారు. తిరుమలలో ఆధ్యాత్మికతను, పవిత్రతను కాపాడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
దాతలు నిర్మించిన అతిథి గృహలు 47 ఉండగా వాటిలో 20 గృహాలకు ఆధ్యాత్మికంగా పేర్లు మార్చాలని ఈవో శ్యామలరావు తెలిపారు. అలిపిరి నడక మార్గంలో సౌకర్యాలు, తిరుమలలో పార్కింగ్ సౌకర్యం పెంచాలన్నారు. టీటీడీలో అన్యమత ఉద్యోగుల బదలీపై న్యాయపరంగా వెళ్తున్నామని, వారికి స్వచ్ఛందంగా పదవి విరమణ చేసే అవకాశం వెతుకుతున్నామన్నారు. అనధికార దుకాణాల వల్ల భక్తులకు సమస్యలు ఏర్పడుతుందని, త్వరలో అనధికార దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దేశ వ్యాప్తంగా టీటీడీకి 61 అనుబంధ ఆలయాలు ఉన్నాయని, కన్సల్టెన్సీ ద్వారా ఈ ఆలయాల అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
తిరుమల భక్తులకు అలర్ట్ - వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ ఎప్పటినుంచంటే!
పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర పార్కింగ్ సమస్యలు ఉన్నాయని శ్యామలరావు వివరించారు. ఆకాశగంగ, పాపవినాశనం తీర్థాలకు భక్తుల తాకిడి పెరిగిందని, ఆ తీర్థాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత మూడు ఏళ్లలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ విభాగంలో లోటు పాట్లు జరిగాయని ఇకపై ఎటువంటి తప్పులు జరగకుండా ఒక కమిటీని వేస్తున్నామన్నారు. ఆరు నెలలుగా టీటీడీ విజిలెన్స్ అధికారులు బాగా పని చేస్తున్నారని తెలిపారు. కొంతమంది దళారులు స్వామివారి దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసం చేస్తున్నారని అలాంచి వారిపై చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.
కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు