Hyderabad CP Releases video on Sandhya Theater Incident: సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, న్యాయ పరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌తో కూడిన వీడియోను ఆయన విడుదల చేశారు. ఏ నిమిషంలో ఏం జరిగిందనే దృశ్యాలను పొందుపరుస్తూ ప్రజెంటేషన్ ఇచ్చారు. డిసెంబరు 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు సీపీ సమాధానం ఇచ్చారు. బౌన్సర్లు ఇకపై పోలీసులను ముట్టుకున్నా, మిస్ బిహేవ్ చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీపీ హెచ్చరించారు. దీనిపై పూర్తి బాధ్యత సప్లై ఏజెన్సీలదేనన్నారు. ప్రజలకు ఇబ్బంది గురించి ఆలోచించే బాధ్యత కూడా వీఐపీలదే అని స్పష్టం చేశారు.
మేనేజర్ ఒప్పుకోలేదు : ఆ రోజు సినిమా వీక్షిస్తోన్న అల్లు అర్జున్ వద్దకు వెళ్లేందుకు ఎస్‌హెచ్‌వో కూడా తీవ్రంగా కష్టపడాల్సి వచ్చిందని సీపీ ఆనంద్ తెలిపారు. అల్లు అర్జున్ మేనేజర్ వద్దకు వెళ్లి తొక్కిసలాట విషయం చెప్పామని తెలిపారు. మహిళ చనిపోయింది, బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని అల్లు అర్జున్‌కు చెప్పామన్నారు. అల్లు అర్జున్ వద్దకు పోలీసులు వెళ్లేందుకు మేనేజర్ ఒప్పుకోలేదన్నారు. దీంతో డీసీపీ వెళ్లి చర్య తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారని తెలిపారు.
మాకు ఎలాంటి సమాచారం లేదు : అక్కడి నుంచి అల్లు అర్జున్ వెళ్లకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని చెప్పాము. సినిమా చూశాకే వెళ్తానని అల్లు అర్జున్ పోలీసులతో అన్నారని వివరించారు. అల్లు అర్జున్ వచ్చేందుకు అనుమతి కోరుతూ థియేటర్ యాజమాన్యం చేసిన దరఖాస్తును తిరస్కరించామని గుర్తుచేశారు. ఈ విషయాన్ని థియేటర్ వాళ్లు అల్లు అర్జున్‌కు చెప్పారో, లేదో తెలియదన్నారు. రెండు థియేటర్లకు కలిపి లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకటే దారి ఉన్నందున అల్లు అర్జును రాకను తిరస్కరించినట్లు వెల్లడించారు. థియేటర్‌కు వస్తున్నట్లు అల్లు అర్జున్ నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదని సీపీ సీపీ ఆనంద్ వెల్లడించారు.
పౌరుల భద్రతే ముఖ్యం : పోలీసులు ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, పౌరుల భద్రత తమకు ముఖ్యమని తెలంగాణ డీజీపీ డా.జితేందర్ తెలిపారు. సంధ్య థియేటర్ ఘటనపై డీజీపీ స్పందించారు. తాము ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, అల్లు అర్జున్ సినీ హీరో అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమాజంలో శాంతిభద్రతలు ఫరిఢవిల్లాలంటే పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సినిమా ప్రమోషన్ల కంటే పౌరుల భద్రత, రక్షణే తమకు ముఖ్యమని డీజీపీ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు జరగటం సమాజానికి ఏమాత్రం మంచిది కాదని అన్నారు.
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - భారీగా మోహరించిన పోలీసులు
అలాంటి వారికి దూరంగా ఉండండి: అభిమానులకు అల్లు అర్జున్ విజ్ఞప్తి