100 Years of Achanta Gandharva Mahal In West Godavari District : చూడగానే మైసూరు మహారాజా ప్యాలెస్ లా, గోల్కొండ కోటలా ఉత్తర భారత నిర్మాణ శైలిని గుర్తుకు తెచ్చే ఈ భవనం పేరు గంధర్వ మహల్. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో ఉన్న ఈ మహల్ నిర్మాణంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు దాగున్నాయి. పూర్వం రాజుల పాలనలో అద్భుతమైన కట్టడాలు, కోటలు వారి ఏలుబడికి సాక్ష్యాలుగా నిలిచేవి. రాచరికం అంతమైన తర్వాత వచ్చిన జమీందారులు కూడా రాజుల తరహాలో అద్భుతమైన భవనాలు నిర్మించి తమ వైభవం చాటే ప్రయత్నం చేశారు. ఆ కోవకు చెందినదే ఈ గంధర్వ మహల్.
ఆచంటకు చెందిన జమీందారు గొడవర్తి నాగేశ్వరరావుకు యాత్రలంటే మక్కువ ఎక్కువ. 1916 కాలంలో జైపూర్, రాజస్థాన్ సహా ఉత్తర భారతంలో పలుమార్లు పర్యటించిన ఆయనకు అక్కడి కోటలు, భవనాలు ఎంతగానో ఆకర్షించాయి. అలాంటి భవనమే ఒకటి నిర్మించాలనే సంకల్పంతో తిరిగి వచ్చిన ఆయన 1918లో ఈ భవనం నిర్మాణానికి పూనుకున్నారు. అరెకరం విస్తీర్ణంలో ఈ మహల్ నిర్మించేందుకు పునాదులు వేశారు. రవాణా సదుపాయాలు ఏమాత్రం లేని ఆ రోజుల్లో విదేశాల నుంచి ఈ భవన నిర్మాణానికి అవసరమైన సామగ్రిని తెప్పించారు. భవనం మొదటి అంతస్తులో ఉపయోగించిన ఇనుప గడ్డర్లను ఇంగ్లాండ్ నుంచి జలమార్గంలో ఓడల ద్వారా తెప్పించారు.
ప్రత్యేక ఆకర్షణగా పియానో: కళానైపుణ్యం ఉట్టిపడేలా, రాచఠీవిని ప్రతిబింబించే సింహద్వారం సహా ఈ భవనంలో ఉపయోగించిన కలప మొత్తం టేకు కాగా దీన్ని అప్పట్లోనే బర్మా నుంచి తెప్పించారు. సింహద్వారం నుంచి లోపలికి వెళ్లగా హాలులో కనిపించే మరోద్వారానికి రెండువైపులా రెండు అద్దాలతో పాటు...పైన సెంట్రలో హాలులో నిలువెత్తు భారీ అద్దాలను బెల్జియం నుంచి తెప్పించినట్లు గొడవర్తి కుటుంబసభ్యులు చెబుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి నాలుగు అంతస్తులుగా ఉండే ఈ మహల్ లో విశాలమైన 12 పడక గదులతో పాటు 25కి పైగా గదులున్నాయి. గంధర్వ మహల్ సెంట్రలో హాలులో దర్శనమిచ్చే పియానో ఈ భవనానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 1885 కాలంలో లండన్ లో నిర్వహించిన ప్రదర్శన పోటీల్లో పురాతన పియానోగా రజత పతకం పొందడం దీని విశిష్టతగా చెప్పవచ్చు. ఇప్పటికీ ఇది ఏమాత్రం చెక్కుచెదరక పోగా మధురమైన స్వరాలను పలికిస్తోంది.
జనరేటర్ ద్వారా విద్యుత్: 1924లో ఈ భవన నిర్మాణం పూర్తికాగా అప్పుడు ఎక్కడా విద్యుత్ సదుపాయం లేదు. ఆ కాలంలోనే పూర్తిగా గోడలోనే విద్యుత్ తీగలను అమర్చి జనరేటర్ ద్వారా రంగు రంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి దేదీప్యమానంగా వెలిగేలా చేశారు. అప్పట్లో ఈ మహల్, విద్యుత్ కాంతులను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి తండోపతండాలుగా ప్రజలు వచ్చేవారని ఇప్పటికీ ఇక్కడ చెప్పుకుంటారు. వందేళ్లు పూర్తయినా ఇప్పటికీ ఈ మహల్ వైభవం తగ్గకపోగా మరింత ఇనుపడింపజేస్తోంది.