AP Government MOU With Meta :వాట్సప్ బిజినెస్ సర్వీసు ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల నవంబరు 30 నుంచి వాట్సప్ ద్వారా 100 రకాల సేవలను పౌరులకు అందించేందుకు చర్యలు చేపట్టింది. రేషన్‌కార్డుల జారీ వివరాలు, రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుకింగ్, పంటల మార్కెట్ ధరలు తెలుసుకోవడం, దైవదర్శనాల అందుబాటు, విద్యార్థుల హాజరులాంటి సేవలను ఇక నుంచి ఒక్క క్లిక్‌తో పొందొచ్చు. దీనికి సంబంధించి మెటాతో ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా వాట్సప్ బిజినెస్ సర్వీస్ డెలివరీ వేదికగా పలు రకాల పౌరసేవలను ప్రజలు పొందనున్నారు.
మూడు ప్రాథమిక విధానాల్లో సేవలందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రభుత్వం నుంచి పౌరులకు, వ్యాపారం నుంచి వినియోగదారుడికి, ప్రభుత్వంలోని విభాగాల నుంచి విభాగాలకు ఇది సేవలను అందిస్తుంది. మొదటి దశలో వాణిజ్య రంగంలో సమర్థమైన ప్రభుత్వ సర్వీసు డెలివరీ కోసం రీ-ఇంజినీరింగ్ ప్రక్రియ, విధానాలను అమలుచేస్తారు. రెండో దశలో ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా సులభంగా పౌరసేవలు అందిస్తారు. యువగళం పాదయాత్రలో సర్టిఫికెట్ల కష్టాలు తప్పిస్తానని మంత్రి లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
పర్యాటక రంగ సమాచారం
- గ్రామ, వార్డు సచివాలయాల్లో 29 విభాగాల్లో 350కిపైగా సేవలను ఇప్పటికే ఏకీకృతం చేశారు. ఇంకా వివిధ విభాగాలను అనుసంధానించి ఇతర సేవలను అందుబాటులోకి తెస్తారు. ఒక గంటలో 10 లక్షల అలర్ట్‌లు ఇవ్వగలిగే సామర్థ్యంతో నోటిఫికేషన్లను వాట్సప్ ఇవ్వనుంది.
- పర్యాటక రంగానికి సంబంధించి ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ అందుబాటులోకి వస్తుంది. పౌరులు తమ సమస్యలను తెలియజేసేందుకు మంచి వేదికగా పని చేస్తుంది.
- దేవాదాయ శాఖకు సంబంధించి ఏపీలోని ఏడు ప్రధాన ఆలయాల్లో దైవ దర్శనం, విరాళాలు, వసతి వివిధ రకాల సేవల కోసం స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు. వాట్సప్ ఇలాంటి సేవలు అందించనుంది.
- రేషన్ కార్డుల కోసం దరఖాస్తు కోసం మార్గదర్శకాలు విడుదలయ్యాక కార్డుల జారీ, రేషన్ పంపిణీ తీరుతెన్నులు తెలుస్తాయి.
- నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ప్రాపర్టీ టాక్స్ చెల్లింపు, వాణిజ్య లైసెన్సు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలలవంటి సేవలు వాట్సప్ ద్వారా పొందొచ్చు.
- రిజిస్ట్రేషన్లకు సంబంధించి వాట్సప్ సాంకేతిక భాగస్వామిగా సేవలను అభివృద్ధి చేస్తారు. భద్రతను నిర్ధారించే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి సకాలంలో సర్టిఫికెట్ల జారీ, నోటిఫికేషన్లు, రిజిస్ట్రేషన్ కోసం స్లాట్‌బుకింగ్ ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వాట్సప్ ద్వారానే కరెంటు బిల్లులు చెల్లించొచ్చు. ప్రజల అభ్యర్థనల మేరకు జియో లొకేషన్ ఆధారంగా పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయడం, ట్రాన్స్‌కో, అంతర్గత కమ్యూనికేషన్,కొత్త హైటెన్షన్ లైన్లు, అలర్ట్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.
- రవాణాకు సంబంధించి లైసెన్సుల సేవలు, అనుమతులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి అన్ని సర్వీసులను వాట్సప్‌తో అనుసంధానం చేస్తారు. దిల్లీ రవాణా సంస్థ మాదిరిగా ఏపీఎస్‌ఆర్టీసీతో మెటా బృందం కలిసి పనిచేయనుంది. పార్సిల్ బుకింగ్, టికెట్ బుకింగ్‌ల కోసం ఆర్టీసీ సేవలను ఏకీకృతం చేస్తారు.