తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నన్ను ఎవరితో పోల్చకండి - నేను నాలానే ఉంటాను'

Yashasvi Jaiswal Latest Interview : టీమ్ఇండియా యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్​ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్​తో పాటు ఇటీవలే జరిగిన టెస్ట్ మ్యాచ్​ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు.

Yashasvi Jaiswal Latest Interview
Yashasvi Jaiswal Latest Interview

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 9:03 PM IST

Yashasvi Jaiswal Latest Interview : సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు టీమ్‌ఇండియా యంగ్​ బ్యాటర్ యశస్వి జైస్వాల్. దీంతో చిన్న వయసులోనే రెండు సెంచరీలు చేయడం వల్ల జైస్వాల్​ను మాజీలైన సౌరభ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్​లతో క్రికెట్ లవర్స్ పోల్చడం ప్రారంభించారు. అయితే రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో మాత్రం మొదటి ఇన్నింగ్స్‌లో మాత్రం తక్కువ పరుగులకే ఈ స్టార్ క్రికెటర్ పెవిలియన్‌కు చేరాడు. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జైస్వాల్​, తనను ఎవరితోనూ పోల్చవద్దని, కేవలం యశస్వి జైస్వాల్‌గానే ఉంటానని వ్యాఖ్యానించాడు. దీంతో పాటు పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.

మీ క్రికెట్‌ కెరీర్‌లో డబుల్‌ సెంచరీకి ఎన్నో ర్యాంకు ఇస్తారు?
యశస్వి: ప్రతి మ్యాచ్‌లోనూ ప్రతి ఇన్నింగ్స్‌కు ఓ విలువ ఉంటుంది. దాని వల్ల ఎంతో సంతృప్తి కలుగుతుంది. భారీగా పరుగులు చేసిన ప్రతిసారీ నేను నా ఆటను ఆస్వాదిస్తాను.

భారీ ఇన్నింగ్స్‌ను మీ కుటుంబం ఎలా సెలబ్రేట్‌ చేసుకుంది?
యశస్వి:ఆ మ్యాచ్‌ తర్వాత నేని మా కుటుంబంతో కలిసి కాస్త సమయం గడిపాను. డబుల్‌ సెంచరీ సాధిస్తే ప్రత్యేకంగా సంబరాలు చేసుకోవాలని నేను కలలు కనేవాడిని. చాలాకాలంగా దీని గురించి పలు ప్లాన్స్​ సిద్ధం చేసుకొనే ఉన్నాను. తాజాగా డబుల్ సెంచరీ తర్వాత కూడా నా స్టైల్‌లో సెలబ్రేట్‌ చేసుకున్నాను.

ఐదు టెస్టుల సిరీస్‌కు మానసికంగా ఎలాంటి సన్నద్ధత అవసరం?
యశస్వి: ఐదు టెస్టుల సిరీస్‌కు ఎంపికయ్యానని తెలిశాక నేను ఎంతో ఆనందించాను. ఇలాంటి భారీ సిరీస్‌లో వివిధ దశలను కాస్త అధిగమించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సాఫీగా ఇన్నింగ్స్‌ సాగినప్పటికీ ప్రత్యర్థి జట్టు నుంచి కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో నేను నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వెస్టిండీస్‌ టూర్‌ నుంచే నేను ఆటను ఆస్వాదించడం ప్రారంభించాను. ఇప్పుడూ అదే చేస్తున్నాను.

విభిన్న పిచ్‌లపై ఆడటం ఎలా అనిపిస్తోంది?
యశస్వి: ప్రతి దేశంలో వారికంటూ ఓ ప్రత్యేక సంప్రదాయాలు ఉంటాయి. భారత జట్టుగా మనం అక్కడికి వెళ్లినప్పుడు వాటిని మనం నేర్చుకోవాలి. సీనియర్ల నుంచి చాలా తెలుసుకోవాలి. రాహుల్‌ ద్రవిడ్‌, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో మాట్లాడుతూ ఉంటాను. వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికాల పిచ్‌ పరిస్థితులు మనకంటే భిన్నంగానే ఉంటాయి. భారత్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం వల్ల మేము అలా అలవాటు పడిపోయాం. అందుకే, విదేశాలకు వెళ్లిన సమయంలో నిరంతరం ఆటను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాను.

బజ్‌బాల్‌పై టీమ్ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో చర్చ జరుగుతుందా?
యశస్వి: టీమ్ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో బజ్‌బాల్‌ గురించి అసలు చర్చే జరగదు. మా ఆటపై మాత్రమే దృష్టి పెడతాం. మైదానంలో మాత్రం ఎలాంటి ప్లాన్స్ అమలుచేయాలనే విషయం గురించే మాట్లాడుకుంటుంటాం. ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ఒకరినొకరం ఎంకరేజ్​ చేస్తుంటాం. జట్టులో ఎల్లప్పుడూ సానుకూల దృక్పథం ఉండేలా చూసుకుంటాం.

'జాజ్‌బాల్' అని పిలిస్తే మీకు ఎలా అనిపిస్తుంటుంది? అండర్సన్‌కు మాటలతో బదులిచ్చారా?
యశస్వి: నన్ను ఏ పేరు పెట్టి పిలిచినా నాకు ఫర్వాలేదు. ప్రేమగా పిలిస్తే మాత్రం చాలు. అయితే, నా ఇంటి పేరు జైస్వాల్. నన్ను అలా పిలిచినా సంతోషపడతాను. ఇక అండర్సన్‌తో మాటల యుద్ధం అస్సు ఉండదు. ఏ బౌలరైనా మంచి బంతి విసిరితే దాన్ని నేను గౌరవిస్తాను. చెత్త బాల్‌ వస్తే మాత్రం బాదేందుకు ప్రయత్నిస్తాను. అండర్సన్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకరు. అతడి బౌలింగ్‌లో ఆడటాన్ని నేను ఆస్వాదిస్తాను.

రోహిత్‌తో మీకు ఎలాంటి రిలేషన్​షిప్​ ఉంది?
యశస్వి:రోహిత్ అద్భుతమైన క్రికెటర్‌తో కలిసి ఆడటాన్ని నేను గౌరవంగా భావిస్తాను. బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో మధ్యలో తన అనుభవాలను షేర్‌ చేస్తుంటాడు. క్లిష్ట సమయాల్లోనూ నింపాదిగా ఉంటాడు. ఏ అనుమానం ఉన్నా అడిగే స్వేచ్ఛ అతడి వద్ద నాకుంది. చెత్త ప్రశ్నను అడిగినప్పటికీ చక్కగా సమాధానం ఇస్తాడు. భారత జట్టు కోసం అద్భుతంగా ఆడాడు.

ధోనీ మీకు ఇచ్చిన కీలక సూచనలు ఏంటి?
యశస్వి: తొలిసారి ధోనీని కలిసినప్పుడు నేను ఆయనకు 'నమస్తే' అని చెప్పాను. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆయన ఏమనుకుంటారోనని అనుకున్నాను. నా మొదటి ఐపీఎల్‌ సందర్భంగా ధోనీ కీపింగ్‌ చేస్తుండగా నేను బ్యాటింగ్‌ చేశాను. ఆ ఫొటో ఇప్పటికీ నా జీవితంలో ఓ అద్భుతమైన జ్ఞాపకం. ఆ మ్యాచ్‌ తర్వాత ధోనీ నాకు రెండు ముఖ్యమైన విషయాలు చెప్పారు. క్రికెట్‌ ఆడటం ఓకే. అదే సమయంలో మనిషిగా పరిపూర్ణత సాధించాలి. అదే నీ జీవిత గమనాన్ని నడిపిస్తుందని అన్నారు. క్రికెట్‌లో ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం. వాటి నుంచి మనం నేర్చుకుంటూ ఉండాలి.

బౌలింగ్‌ చేయడంపై ఆసక్తి ఉందా? సెహ్వాగ్‌, గంగూలీతో పోల్చడంపై?
యశస్వి: బౌలింగ్‌ చేయడాన్నీ ఆస్వాదిస్తా. ప్రాక్టీస్‌ సందర్భంగానూ బంతులేస్తుంటాను. తప్పకుండా భారత జట్టు తరఫున బౌలింగ్‌ చేసే అవకాశం వస్తుందని నేను భావిస్తున్నాను. చాలామంది నన్ను స్టార్ క్రికెటర్లతో పోల్చుతున్నారు. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాను. కానీ, నేను మాత్రం యశస్వి జైస్వాల్‌లా మాత్రమే ఉండేందుకు ఇష్టపడతాను.

జైస్వాల్​పై ప్రశంసల జల్లు - 'అతడి ఆట చూస్తే దాదా గుర్తొస్తున్నాడు'

ఉప్పల్‌ టెస్ట్ : స్పిన్నర్ల మ్యాజిక్​ - దంచికొట్టిన జైశ్వాల్​

ABOUT THE AUTHOR

...view details