WI vs PNG T20 World Cup 2024 :పాపువా న్యూగినీ. ప్రపంచ క్రికెట్లో పసికూన. వరల్డ్ కప్‌నకు అర్హత సాధించినా ఎవరూ ఆ జట్టును పట్టించుకోలేదు. కానీ ఇప్పుడా జట్టు తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో రెండుసార్లు ఛాంపియన్, ఫేవరెట్‌గా బరిలోకి దిగిన వెస్టిండీస్ ఈ పసికూన జట్టుపై గెలిచేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.
మ్యాచ్ సాగిందిలా -టీ20 వరల్డ్ కప్‌లో ఆతిథ్య విండీస్ జట్టు శుభారంభం చేసింది. తాజాగా ఆదివారం జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో గెలిచినప్పటికీ కాస్త కలవరం తప్పలేదు. పసికూన పాపువా న్యూగినీపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఛేదనను ఘనంగానే ఆరంభించినా తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. వాస్తవానికి స్వల్ప లక్ష్యం కావడం, జట్టులో హిట్టర్లకు కొదువ లేకపోవడం వల్ల అలవోకగా లక్ష్యాన్ని పని పూర్తి చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ జట్టు అనూహ్యంగా తడబడుతూ ఆడింది. 8 ఓవర్లలో 61/1తో లక్ష్యం దిశగా సాఫీగా సాగిన ఇన్నింగ్స్ అనంతరం చకచకా నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో ఓ దశలో పరుగుల వేటలో వెనకబడి 16 ఓవర్లలో 97/5తో చిక్కుల్లో కూడా పడింది. స్పిన్నర్ వలా (2/28) అదిరే బౌలింగ్ చేస్తూ చెలరేగాడు. ఈ క్రమంలోనే చివరి నాలుగు ఓవర్లలో 40 పరుగులు చేయాల్సిన సమయంలో మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఓ దశలో పాపువా న్యూగినీ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ విండీస్ మళ్లీ చెలరేగి ఆడడంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఆ జట్టు మ్యాచ్ గెలిచింది. రోస్టన్ చేజ్ (27 బంతుల్లో 4×4, 2×6 - 42 నాటౌట్; ), బ్రెండన్ కింగ్ (29 బంతుల్లో 7×4 - 34) రాణించారు. జాన్ కరికో, చాడ్ సోపర్, అలె నా తలో వికెట్ తీశారు.