USA vs Canada T20 World Cup:2024 టీ20 వరల్డ్‌కప్ తొలి మ్యాచే క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చింది. యూఎస్ఏ- కెనడా మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ క్రీడాప్రియులకు మజానిచ్చింది. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా పోరాడిన అమెరికా (యూఎస్ఏ) 7 వికెట్ల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. కెనడా నిర్దేశించిన 195 పరుగుల భారీ టార్గెట్‌ను అమెరికా 17.4 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
29ఏళ్ల అరోన్ జోన్స్ మెరుపు ఇన్నింగ్స్ (94 పరుగులు; 40 బంతుల్లో: 4x4, 10x6)తో జట్టుకు అలవోకగా విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో జోన్స్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో జోన్స్ 94 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన నాన్ ఓపెనర్‌గా జోన్స్ రికార్డు నెలకొల్పాడు. ఇక అత్యధిక సిక్సర్లు బాదిన నాన్ ఓపెనర్ రికార్డునూ జోన్స్ తనపేరిట లిఖించుకున్నాడు.
ఈ రికార్డు ఇదివరకు సౌతాఫ్రికా ప్లేయర్ రెలీ రొస్సో (8) పేరిట ఉండేది. ఇక టీ20 వరల్డ్‌కప్ ఇన్నింగ్స్‌లో ఓవరాల్‌గా అత్యధిక సిక్స్‌లు బాదిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. ఈ లిస్ట్‌లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (11) టాప్‌లో ఉన్నాడు. గేల్ తర్వాత 10 సిక్స్‌లతో జోన్స్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీళ్ల తర్వాత రోసో (8), యువరాజ్ సింగ్ (7), డేవిడ్ వార్నర్ (7) ఉన్నారు.