Tilak Varma Mumbai Indians :టీమ్ఇండియా యంగ్ ప్లేయర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ముంబయి ఇండియన్స్ జట్టు తనను రిటైన్ చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. గత 3ఏళ్లుగా ముంబయికి ప్రాతినిధ్యం వహించడాన్ని ఎంజాయ్ చేశానని తెలిపాడు. ముంబయి ఫ్రాంచెజీ టీమ్ బాండింగ్ బాగుంటుందని అన్నాడు. ఐపీఎల్‌లో తనను రిటైన్ చేసుకోవడంపై తిలక్ వర్మ స్పందించాడు.
తిరిగి ఇవ్వాల్సిన టైమ్ వచ్చింది
'ముంబయి లాంటి స్టార్ ఫ్రాంచైజీ నన్ను రిటైన్ చేసుకోవడం సంతోషంగా ఉంది. గత మూడేళ్లుగా ముంబయి తరఫున ప్రాతినిధ్యం వహించడాన్ని ఎంజాయ్ చేశాను. అయితే మూడు సీజన్లుగా ముంబయి ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. ఇక టైటిల్ నెగ్గాల్సిన సమయం వచ్చేసింది. మంబయి ఇండియన్స్ టీమ్ బాండింగ్ బాగుంటుంది. అందరూ సరదాగా ఉంటారు. డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం కూడా బాగుంటుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి సరదా వాతావరణం ఉంటుందో, మైదానంలోనూ అలానే ఉంటుంది. కఠిన సమయాల్లో నాకు సీనియర్ ఆటగాళ్లు, కోచ్ స్టాఫ్ అండగా నిలిచారు. ముంబయి ఇండియన్స్ నాకు చాలా ఇచ్చింది. ఇప్పుడు ఆ జట్టుకు నేను తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. వచ్చే సీజన్లో టైటిల్ ఇస్తానని ఆశిస్తున్నా' అని తిలక్ వర్మ అన్నాడు. ఈ వీడియోను ముంబయి ఇండియన్స్ ట్విట్టర్లో షేర్ చేసింది.
మూడేళ్లుగా ముంబయితోనే
2022 వేలంలో ముంబయి ఫ్రాంచైజీ తెలుగు కుర్రాడు తిలక్ వర్మను దక్కించుకుంది. గత మూడు సీజన్ల నుంచి తిలక్ వర్మ ముంబయి తరఫున నిలకడగా ఆడుతున్నాడు. ముంబయి కష్టకాలంలో ఉన్న సమయంలో తిలక్ ఆదుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. దీంతో తిలక్‌ను తాజాగా ముంబయి రూ.8 కోట్ల భారీ ధరకు అట్టిపెట్టుకుంది. కాగా, 38 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 146 స్ట్రైక్ రేట్‌తో 1156 రన్స్ చేశాడు. అందులో ఆరు అర్ధశతకాలు ఉన్నాయి.