T20 World Cup Jersey Cost :జూన్ 1న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మొదలుకానుంది. షెడ్యూల్ దగ్గరపడుతున్న కొద్ది, టీ20 ప్రపంచ కప్ అప్‌డేట్‌లు క్రికెట్ ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతున్నాయి. తాజాగా ఆయా జట్లు తమ టీ20 వరల్డ్ కప్ జెర్సీని ఆవిష్కరించడం ప్రారంభించాయి. భారత జట్టు కిట్ స్పాన్సర్ అడిడాస్, ఇండియన్ టీమ్ జెర్సీని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఫ్యాన్ వెర్షన్ ధర ఎంతంటే ?
మంగళవారం నుంచి ఈ జెర్సీలు దేశవ్యాప్తంగా తమ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. దాని ధరను ఆ సంస్థ రూ.5999గా పేర్కొంది. అయితే భారత క్రికెట్ అభిమానుల డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని, అదే జెర్సీని ఫ్యాన్ వెర్షన్లో కూడా లాంఛ్ చేసింది. ఈ జెర్సీని అభిమానులు కేవలం రూ.999కే సొంతం చేసుకోవచ్చు. ఇదే తరహాలో వన్డే ప్రపంచ కప్ 2023 సమయంలో కూడా అడిడస్, ఫ్యాన్ వెర్షన్ జెర్సీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
కిట్ స్పాన్సర్‌షిప్ కోసం అడిడాస్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాతో నాలుగు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ 2023లో కూడా టీమ్ ఇండియా జెర్సీకి అడిడాస్ ప్రాతినిధ్యం వహించింది.