Priyansh Arya IPL:2024 దిల్లీ ప్రీమియర్ లీగ్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాది వెలుగులోకి వచ్చిన యంగ్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య ప్రస్తుతం ఇంటర్నెట్లో హాట్ టాపిగ్గా మారాడు. లీగ్‌లో నిలకడగా రాణిస్తున్న ఈ యువ ఆటగాడి కోసం 2025 ఐపీఎల్ మెగా వేలంలో కచ్చితంగా తీవ్ర పోటీ ఉంటుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రియాన్ష్ తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడాలని ఉందన్నాడు. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ అని పేర్కొన్నాడు. ఈ మేరకు తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
'విరాట్ కోహ్లీ నాకు ఇష్టమైన క్రికెటర్. ఆర్సీబీ టీమ్ అంటే కూడా చాలా ఇష్టం. ఐపీఎల్లో ఆ జట్టుకు ఆడాలని ఉంది. కెరీర్ పరంగా నేను విరాట్ కోహ్లీని ఫాలో అవుతా. అతడి దూకుడుతనం (Aggression) నాకు నచ్చుతుంది. నాకు కూడా అలా దూకుడుగా ఆడడమే ఇష్టం. అతడే నా రోల్ మోడల్' అని ప్రియాన్ష్ అన్నాడు. ఇక ఇటీవల దిల్లీ ప్రీమియర్ లీగ్ టోర్నీలో నార్త్ దిల్లీ జట్టుపై ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు బాదిన సందర్భం గురించి కూడా ప్రియాన్ష్ మాట్లాడాడు. 'ఆ ఓవర్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బౌలింగ్‌కు వచ్చాడు. దీంతో అతడి బౌలింగ్‌ను అటాక్ చేయాలని వెంటనే ఫిక్స్ అయ్యా. ఇక నాలుగో సిక్స్ బాదిన తర్వాత, 6 సిక్స్‌లు బాదగలను అని నాకు నమ్మకం వచ్చింది. నాన్ స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న ఆయుష్ కూడా 'నువ్వు చేయగలవు' అని ప్రోత్సహించాడు' అని చెప్పాడు. కాగా, ఆ మ్యాచ్‌లో ప్రియాన్ష్ 50 బంతుల్లోనే 120 పరుగులతో సత్తా చాటాడు.