Shami Replacement IPL 2024:టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా 2024 ఐపీఎల్‌కు దూరమయ్యాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టుకు టోర్నీ ప్రారంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అయితే షమీ రిప్లేస్మెంట్ కోసం గుజరాత్ ఫ్రాంచైజీ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో షమీ తమ్ముడు మహ్మద్ కైఫ్‌ను జట్టులోకి తీసుకోనున్నారన్న ప్రచారం సాగుతోంది.
27ఏళ్ల మహ్మద్ కైఫ్ 2021లో లిస్ట్- A క్రికెట్లో అరంగేట్ర చేశాడు. ఇక 2024 రంజీ టోఫ్రీలోనూ కైఫ్ ఆడాడు. అతడు బంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ టోర్నీలో మంచి ప్రదర్శన కనబర్చిన కైఫ్ 6 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు నేలకూల్చాడు. అందులో రెండుసార్లు 4+ వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో షమికి బదులు అతడి తమ్ముడిని గుజరాత్ జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతేడాది డిసెంబర్లో దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ వేలంలో కైఫ్ అన్‌సోల్డ్‌గా మిలిగిపోయాడు. రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన కైఫ్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు.
Shami Ankle Surgery: ఇక షమీ విషయానికొస్తే, 2023 వరల్డ్ కప్ తర్వాత ఆటకు దూరమయ్యాడు. ఈ టోర్నీలో అతడు కాలి మడిమ నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఈ తర్వాత జరిగిన సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్ సిరీస్‌లకు కూడా దూరమయ్యాడు. అయితే, మార్చిలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్ వరకు షమీ పూర్తిగా కోలుకుంటాడని అనుకున్నారంతా. కానీ, అతడి గాయం ఇంకా తగ్గలేదు. సర్జరీ కోసం అతడు త్వరలోనే యూకేకు వెళ్లనున్నాడు. దీంతో షమీ ఇంకా దాదాపు 6- 8 నెలలు ఆటకు దూరమయ్యే ఛాన్స్ ఉంది.