Virat Kohli IPL Records:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ ప్రస్తుత ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. ఆర్సీబీ ఫలితాలు ఏవైనప్పటికీ విరాట్ ప్రదర్శన మాత్రం అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ప్రస్తుత సీజన్లో 500 పరుగులు బాది సీజన్లో టాప్- 2లో కొనసాగుతున్నాడు. అందులో ఓ సెంచరీ కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో విరాట్‌ను మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. అదేంటంటే?
ఐపీఎల్ సీజన్- 17లో శనివారం (మే 4) ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. అయితే విరాట్ ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు చిన్నస్వామి స్టేడియంలో 83 ఇన్నింగ్స్‌లో 40.61 సగటుతో 2924 పరుగులు చేశాడు. మరో 76 పరుగులు సాధిస్తే, ఐపీఎల్లో ఒకే వేదికగా 3000 పరుగులు పూర్తి చేసిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కాకపోయినా, ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ మరో రెండు మ్యాచ్‌లు చిన్నస్వామిలోనే ఆడాల్సి ఉంది. అంటే ఈ సీజన్లోనే విరాట్ ఈ ఘనత సాధించడం ఖాయం! ఇక ఈ లిస్ట్‌లో ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ వాంఖడే స్టేడియంలో ఇప్పటివరకు 77 ఇన్నింగ్స్‌ల్లో 2223 పరుగులు చేశాడు.
ఐపీఎల్లో ఓకే గ్రౌండ్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు
- విరాట్ కోహ్లీ - చిన్నస్వామి స్టేడియం- 2924 పరుగులు
- రోహిత్ శర్మ- వాంఖడే స్టేడియం- 2223 పరుగులు
- ఏబీ డివిలియర్స్- చిన్నస్వామి స్టేడియం- 1960 పరుగులు
- డేవిడ్ వార్నర్- రాజీవ్ గాంధీ స్టేడియం (ఉప్పల్, హైదరాబాద్)- 1623 పరుగులు
- క్రిస్ గేల్- చిన్నస్వామి స్టేడియం- 1561 పరుగులు