Rohit Sharma Ritika Love Story :లవ్ స్టోరీలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. అది సామాన్యులైనా,సెలబ్రెటీలైనదైనా సరే. అయితే కొంతమంది దంపతులను చూస్తే అబ్బా చూడముచ్చటగా ఎంత చక్కగా ఉంది అని అనిపిస్తుంటుంది. అలాంటి జంటల్లో భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, రితికా సింగ్ కపుల్ ఒకటి. ఎప్పుడూ బెస్ట్‌ఫ్రెండ్స్‌లా కలియతిరిగే ఈ జంటది లవ్ మ్యారేజ్. అయితే వీరి లవస్టోరీ కూడా కాస్త సినిమాటిక్‌గానే అనిపిస్తుంది. ఒకానొక సమయంలో స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ రోహిత్ శర్మకు రితికా విషయంలో వార్నింగ్ ఇచ్చాడట. ఇంతకీ ఏం జరిగిందంటే ?
2008లో యువరాజ్, రోహిత్ ఓ యాడ్ షూట్లో పాల్గొన్నారు. ఆ షూట్‌కు రితికా మేనేజర్. అప్పటికే రితికాతో యువరాజ్‌కు ఓ ప్రత్యేక అనుబంధం ఉండేది. రితికాను అతడు తన సొంత చెల్లిలా భావించేవాడు. అందుకే షూటింగ్‌కు రాగనే రోహిత్‌కు ముందుగానే ఓ వార్నింగ్ ఇచ్చాడు. రితికాను చూపిస్తూ 'తను ఓ స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్. ఆమెకు నువ్వు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది' అంటూ హెచ్చరించాడు. దీంతో షాక్ అయిన రోహిత్ 'ఆమెతో నాకేం పని? నేను ఇక్కడికి వచ్చింది కేవలం షూటింగ్లో పాల్గొనేందుకు మాత్రమే' అంటూ తాను కూడా గట్టిగానే సమాధానం ఇచ్చాడట.
కొన్ని రోజుల తర్వాత మరో షూట్లో రోహిత్-రితికా కలిశారు. అయితే మొదటిసారి రితికాను చూసినప్పుడు పెద్దగా పట్టించుకోని రోహిత్, ఆ తర్వాత కలిసినప్పుడు మాత్రం ఆమె వ్యవహారించిన తీరుకు పడిపోయాడట. షూటింగ్ సమయంలో మైక్రోఫోన్‌తో ఇబ్బంది పడినప్పుడు ఆమె హుందాగా స్పందించిన తీరును రోహిత్ మెచ్చుకోకుండా ఉండలేకపోయాడట. అలా వారిద్దరి మధ్య మాటలు కలిశాయి. ఆ తర్వాత అది స్నేహంగా పెరిగి కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రొఫెషనల్‌గా దగ్గరయ్యారు. కొంత కాలం అలా స్నేహితులుగా ఎంతో హ్యాపీగా ఉన్నారు.