Rishabh Pant Road Accident : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవలే జరిగిన ఐపీఎల్లో అద్భుత ఫామ్ కనబరిచాడు. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న పంత్, తన ఐపీఎల్ పెర్ఫామెన్స్‌తో రానున్న టీ20 ప్రపంచ కప్ టీమ్‌లోనూ స్థానం సంపాదించాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికా చేరుకున్న పంత్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నాడు. యాక్సిడెంట్ తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడాడు.
"ఆ యాక్సిడెంట్ నా జీవితాన్ని ఎంతో మార్చింది. ఆ సమయం నాకు ఎంతో అనుభవాన్ని నేర్పింది. అంతటి గాయాలు చూసి నేను ప్రాణాలతో ఉంటానో లేదో అని అనిపించింది. దాదాపు ఏడు నెలల పాటు విపరీతమైన నొప్పిని అనుభవించాను. అది ఎంతో నరకంగా అనిపించింది. సుమారు రెండు నెలల పాటు కనీసం బ్రష్ కూడా చేసుకోలేకపోయాను. వీల్ ఛైర్‌లో కూర్చున్న వ్యక్తులను చూస్తే చాలా ఇబ్బందిగా అనిపించేది. అంతే కాకుండా భయంగానూ ఉండేది. అందుకే నేను చాలా వరకు ఎయిర్‌పోర్టుకు వెళ్లలేకపోయాను. కానీ ఆ భగవంతుడు నన్ను రక్షించాడు" అంటూ అప్పటి చేదు అనుభవాలను పంత్ గుర్తు చేసుకున్నాడు.
ఇక రానున్న టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటికే టీమ్ఇండియా యూఎస్‌కు పయనమైన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, శివమ్ దూబే ప్రయాణమయ్యారు. వీరితోపాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా వెళ్లారు. టీమ్ఇండియా తన తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది.