Rishabh Pant Fake Injury : టీమ్ఇండియా 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచి చాలా రోజులైంది. విజయోత్సవ ర్యాలీ, సంబరాలు అన్నీ పూర్తయిపోయాయి. కానీ దక్షిణాఫ్రికాతో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతున్న సమయంలో భారత ఆటగాళ్లు, అభిమానులు అనుభవించిన నరాలు తెగే ఉత్కంఠ గురించి మాత్రం ఇప్పటికీ చర్చించుకుంటూ ఉంటారు. దాదాపు టీ20 కప్పు చేజారిపోయిందనుకొన్న తరుణంలో భారత్ అద్భుతంగా పుంజుకొంది. కోట్ల మంది కలలను నిజం చేస్తూ కప్పును చేజిక్కించుకొంది.
ఈ విజయానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో పంత్ చేసిన తెలివైన పని కూడా ఓకటని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. తాజాగా ఈ ఆసక్తికర ఘటన గురించి రోహిత్ 'ది కపిల్ శర్మ షో'లో మాట్లాడాడు. దీనిపై టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా స్పందించాడు. ఇంతకీ ఫైనల్ మ్యాచ్‌లో పంత్ ఏం చేశాడో? తెలుసా?
దక్షిణాఫ్రికా జోరును ఆపిన పంత్?
షోలో కెప్టెన్ రోహిత్ శర్మ షేర్ చేసుకొన్న స్టోరీ ప్రకారం, 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చివరి నిమిషాల్లో దక్షిణాఫ్రికా కప్పు గెలవనుందని చాలా మంది భావించారు. దక్షిణాఫ్రికాకి ఓ సమయంలో 30 బంతుల్లో 30 పరుగులు అవసరం. క్రీజులో హెన్రిచ్ క్లాసెస్, మిల్లర్ ఊపు మీద ఉన్నారు. ఆ సమయంలో వికెట్ కీపర్ పంత్ దక్షిణాఫ్రికా లయను దెబ్బతీయాలని భావించాడు. మోకాలిలో నొప్పి కలుగుతున్నట్లు కింద పడిపోయాడు. వెంటనే టీమ్ ఫిజియో మైదానంలోకి వచ్చాడు. మ్యాచ్ కొన్ని నిమిషాలపాటు ఆగాల్సి వచ్చింది.