RCB Vs PBKS IPL 2024 :ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో గెలిచి 2024 సీజన్‌లో తొలి విజయం సాధించింది ఆర్సీబీ. విరాట్ కోహ్లి (49 బంతుల్లో 11×4, 2×6 సాయంతో 77 పరుగులు) అద్భుతంగా రాణించడంతో ఆసక్తికరంగా సాగిందీ మ్యాచ్. ఫలితంగా ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలిచింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 176 రన్స్ చేసింది. తొలి బాల్ నుంచే ఆచీతూచీ ఆడింది. ప్రత్యర్థులు వేసిన బంతులను చాకచక్యంగా ఎదుర్కొని మంచి స్కోర్ చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (37 బంతుల్లో 5×4, 1×6 సాయంతో 45 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జితేశ్ శర్మ (20 బంతుల్లో 1×4, 2×6 సాయంతో 27 పరుగులు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (17 బంతుల్లో 2×4, 2×6 సాయంతో 25 పరుగులు), సామ్ కరన్ (17 బంతుల్లో 3×4 సాయంతో 23 పరుగులు) చేశారు. చివరి ఓవర్లో వచ్చిన శశాంక్ సింగ్ (21) కూడా కీలక ఇన్నింగ్స్ అందించాడు. సిరాజ్, మ్యాక్స్‌వెల్ తలో రెండు వికెట్లు తీశారు. అల్జారీ జోసెఫ్,యశ్ దయాల్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇక 177 పరుగుల ఛేధనలో కోహ్లీ చేసిన స్కోరును సద్వినియోగం చేస్తూ చివర్లో దినేశ్ కార్తీక్ (10 బంతుల్లో 3×4, 2×6 సాయంతో 28 నాటౌట్), లొమ్రార్ (8 బంతుల్లో 2×4, 1×6 సాయంతో 17 నాటౌట్) మంచిగా రాణించడం వల్ల ఆర్సీబీ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హర్‌ప్రీత్ బ్రార్ (2/13), రబాడ (2/23) అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అర్ష్‌దీప్ (3.2 ఓవర్లలో 40), హర్షల్ పటేల్ (1/45) ధారాళంగా పరుగులిచ్చేశారు.