Rahul Dravid T20 World Cup 2024 : మళ్లీ వెస్టిండీస్ వేదికగా ప్రపంచకప్ వచ్చింది. కాకపోతే ఈ సారి విండీస్ సహ ఆతిథ్య జట్టు. కానీ భారత్ పరిస్థితి మాత్రం ఏమాత్రం మారలేదు. ఈ సారీ వన్డే ప్రపంచకప్‌లో పరాభవం ఎదుర్కొంది. అయితే 2007 ఏడాది లాగా తొలి రౌండ్లోనే ఇంటికి రాలేదు. సొంతగడ్డపై వరుస విజయాలతో ఫైనల్‌కు వెళ్లింది. కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓడి అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేని బాధను మిగిల్చింది.
అయితే ప్రస్తుత అభిమానులు కూడా 2007 వన్డే ప్రపంచకప్ నాటి మానసిక స్థితిలోనే ఉన్నారు. ఈ బాధను ఇంకా మరిచిపోకమందే టీ20 ప్రపంచకప్ వచ్చింది. మరి ఈ సారి 2007లో ఆడిన స్టార్లలో మిగిలిన ప్లేయరే జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు! 2007 వన్డే ప్రపంచకప్ సారథి అయిన రాహుల్ ద్రవిడ్ ప్రస్తుత జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ తమ కల నెరవేర్చుకుంటారా? ఆ జట్టు నుంచి అతడొక్కడే
2007 టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత జట్టులో రోహిత్ శర్మ కీలక సభ్యుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమ్ఇండియా తరఫున ఉండి ప్రస్తుత జట్టులోనూ ఆడుతున్న ఏకైక ప్లేయర్ అతడు. ఓ ప్లేయర్‌గా అపార అనుభవం ఉన్న ఈ స్టార్ ప్లేయర్‌పై ఇప్పుడు కెప్టెన్‌గా జట్టుకు కప్ అందించాల్సిన పెద్ద బాధ్యత ఉంది. స్వదేశంలో వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను ఫైనల్‌కు చేర్చినప్పటికీ ఆఖరి పోరులో ఓటమిని చవిచూడక తప్పలేదు.
ఇక కెరీర్‌లో బహుశా చివరి ప్రపంచకప్ ఆడనున్న రోహిత్‌కు ఈ టీ20 కప్‌తో అభిమానులను మురిపించడానికి ఇంతకుమించిన అవకాశం దొరకదని విశ్లేషకుల అభిప్రాయం. కానీ 2007 ప్రపంచకప్‌లో గెలిచిన తర్వాత జరిగిన తర్వాత టీమ్‌ఇండియాకు టీ20 ప్రపంచకప్ మళ్లీ చిక్కలేదు. పైగా ఈ టోర్నీలో మిగతా జట్ల నుంచి కూడా పోటీ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ సారి కప్ సాధించడం, అది కూడా విదేశీ గడ్డపై దాన్ని అందుకోవడం పెద్ద సవాల్.
బ్యాటింగ్, బౌలింగ్ ఇలా రెండింటిలోనూ టీమ్‌ఇండియా బలంగా ఉంది. అంతే కాకుండా ఈ సారి కప్ ఎలాగైన గెలవాలన్న కసితో ప్లేయర్లు ఉండటం ప్లస్ పాయింట్. ఈ నేపథ్యంలో సహచరులను సమన్వయపరుచుకొంటూ, వనరులను వాడుకుంటూ రోహిత్ ఎలా ముందుకెళ్తాడో అనేది ఆసక్తికరం.