Gukesh D Fide Champion:17 ఏళ్లకే ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ విజేతగా నిలిచిన భారత యువ సంచలనం గుకేశ్‌పై ప్రసంసల జల్లు కురుస్తోంది. అతడి విజయాన్ని అభినందిస్తూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో అతడిని అభినందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్)లో విషెస్ తెలిపారు. 'గుకేశ్ నీ పట్ల భారతదేశం గర్విస్తోంది. టొరొంటోలో గుకేశ్ సాధించిన విజయం అతడి ప్రతిభ, డెడికేషన్‌కు నిదర్శనం. గుకేశ్ ప్రయాణం మిలియన్ల మందికి స్ఫూరి' అని మోదీ ట్వీట్ చేశారు.
ఇక గుకేశ్ విజయంపై చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ స్పందించారు. ఆయన కూడా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. చిన్న వయసులో ఛాలెంజర్‌గా మారినందుకు అభినందించారు. 'వాకా చెస్ ఫ్యామిలీ నీ విజయం పట్ల గర్విస్తోంది. క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు ఆడిన ఆట పట్ల నిజంగా గర్విస్తున్నా' అని విశ్వనాథన్ ఆనంద్ తెలిపారు. ఇక మహీంద్ర సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి కిరణ్ రిరీజు, తమిళనాడు మంత్రి ఉథయనిధి స్టాలిన్ కూడా గుకేశ్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.