Paris Paralympics 2024 : ఫ్యాషన్ నగరి పారిస్‌లో మరో ప్రపంచ క్రీడా సంబరానికి తెరలేసింది. పారాలింపిక్స్ 2024 క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గ్యాలరీలన్నీ క్రీడాభిమానులతో నిండిపోయాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడాభిమానులను బాగా అలరించాయి. ఆకట్టుకునే కళా ప్రదర్శనలు, అబ్బురపరిచే కళాకారుల విన్యాసాలతో ఈ వేడుక కన్నులవిందుగా సాగింది. ఈ వేడుకల్లో దివ్యాంగ క్రీడాకారులే కాకుండా పలువురు దివ్యాంగ కళాకారులు కూడా తమ కళను ప్రదర్శించారు. నేల మీదే కాదు గాల్లోనూ అనేక విన్యాసాలు సాగాయి. ఫ్రాన్స్ జెండాలోని మూడు రంగుల్ని 8 విమానాల ద్వారా విడుదల చేస్తూ ఆకాశంలో చేసిన ఎయిర్ షో వీక్షకుల్ని విశేషంగా కట్టిపడేసింది.
అయితే ఈ కార్యక్రమాన్ని కూడా స్టేడియంలో కాకుండా బయటే నిర్వహించారు. రీసెంట్గా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని సెన్ నదిలో నిర్వహించగా, ఇప్పుడు పారాలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలను కూడా తొలిసారి బహిరంగ ప్రదేశంలో డిలా కాంకార్డ్ వేదికగా నిర్వహించారు. అథ్లెట్ల పరేడ్‌ను ఛాంప్స్ ఎలీసీస్ నుంచి ప్లేస్ డిలా కాంకార్డ్ వరకు సాగింది.
టోక్యో పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ విన్నర్ సుమిత్ ఆంటిల్(జావెలిన్ త్రో), ఆసియా పారా క్రీడల్లో సిల్వర్ మెడల్ విన్నర్ భాగ్యశ్రీ జాదవ్ (షాట్‌పుట్) భారత పతాకధారులుగా వ్యవహరించారు.
11 రోజుల పాటు ఈ పారిస్ పారాలింపిక్స్ సాగనుంది. సెప్టెంబరు 8న ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. 22 క్రీడల్లో 4 వేల మందికి పైగా పారా వీరులు పోటీ పడుతున్నారు. భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు బరిలో దిగారు. తొలిరోజు ట్రాక్ సైక్లింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో, పతకాంశాలు జరుగబోతున్నాయి. ఇప్పటికే ఈ పారాలింపిక్స్ కోసం 20 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయట.