Olympic Hosting Advantages And Disadvantages : ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరమైన ఒలింపిక్స్ మరికొద్దిరోజుల్లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. పారిస్ వేదికగా జరగనున్న ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు ఇప్పటికే భారత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు పయనమయ్యారు. మరీ ఈ స్థాయి క్రీడలు నిర్వహించడానికి పెద్దమొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తెలిసిందే. మరి ఒలింపిక్స్ నిర్వహించడం వల్ల ఆతిథ్య దేశాలకు లాభామా, నష్టమా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
2012లో ఒలింపిక్స్ నిర్వహించిన లండన్, ఆ ఈవెంట్ కోసం సుమారు 14.6 బిలియన్ల డాలర్లను ఖర్చు చేసింది. పన్ను చెల్లింపుదారుల నుంచి దాదాపు 4.4 బిలియన్ల డాలర్లు వచ్చాయి. 2008లో బీజింగ్ ఒలింపిక్స్ ఖర్చు 42 బిలియన్ డాలర్లు. 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్ కోసం సుమారు 15 బిలియన్లు డాలర్లను ఖర్చు చేసింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్ ఖర్చు 4.6 బిలియన్ల డాలర్లు. పన్ను చెల్లింపుదారుల నుంచి అందులో 11.4 మిలియన్ల డాలర్లను కవర్ చేశారు. 2016 రియో డి జెనీరో ఈ ఒలింపిక్స్ కోసం దాదాపు 20 బిలియన్ల డాలర్లకు పైగా ఖర్చు చేసింది.
ఒక నగరం ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి బిడ్‌ను గెలుచుకున్న తర్వాత, తప్పనిసరిగా రోడ్లు, విమానాశ్రయాలు, రైలు మార్గాలు, అథ్లెట్లకు గృహాలు, కనీసం 40,000 హోటల్ గదులు వంటి భారీ మౌలిక సదుపాయాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. అవసరానికి తగ్గట్లు వాటిని నిర్మించాలి లేదా మెరుగుపరచాల్సి ఉంటుంది. ఈ ఖర్చులు సూమారు 5 బిలియన్ల డాలర్ల నుంచి 50 బిలియన్ల డాలర్ల వరకు ఉంటాయని సమాచారం.
ఒలింపిక్స్ నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఒలింపిక్స్‌ను హోస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలికంగా నగరాలకు మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా తాత్కాలిక ఉద్యోగాలు లభిస్తాయి. ఉదాహరణకు, రియో డి జనీరో 2016 గేమ్స్ కోసం 15,000 కొత్త హోటల్ గదులను నిర్మించింది. రష్యా, సోచి 2014 ఒలింపిక్స్ కోసం నాన్-స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం సుమారు 44.3 బిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. బీజింగ్ రోడ్లు, విమానాశ్రయాలు, సబ్‌వేలు, రైలు మార్గాల కోసం 22.5 బిలియన్ల డాలర్లు పైగా ఖర్చు చేసింది. దీంతో పాటు దాదాపు 11.25 బిలియన్ల డాలర్లు పర్యావరణ శుభ్రత కోసం వెచ్చించింది. అదనంగా, స్పాన్సర్‌లు, మీడియా, క్రీడాకారులు, ప్రేక్షకుల ప్రవాహం హోస్ట్ చేస్తున్న నగరానికి అదనపు ఆదాయాన్ని తెస్తుంది.
ఒలింపిక్స్‌ను నిర్వహించడంలో నష్టాలు
ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఉద్యోగ కల్పన తరచుగా అంచనాల కంటే తక్కువగా ఉంటుంది. సాల్ట్ లేక్ సిటీ 2002 ఒలింపిక్స్ కోసం 7,000 ఉద్యోగాలను మాత్రమే క్రియేట్ చేసింది. ఇది ఊహించిన సంఖ్యలో 10% మాత్రమే. ఈ ఉద్యోగాలలో చాలా వరకు ఇప్పటికే ఉపాధి పొందిన కార్మికులకు వెళ్ళాయి. కాబట్టి నిరుద్యోగం రేట్లు పెద్దగా మారలేదు. అలానే ఆటల నుంచి వచ్చే లాభాలు తరచుగా స్థానిక ఆర్థిక వ్యవస్థ కంటే అంతర్జాతీయ కంపెనీలకు వెళ్తాయి.