Cricketer Nitish Kumar Reddy Latest Interview : టీమ్ఇండియాకు ఆడాలన్న తన కల నెరవేరిందంటూ యంగ్ ప్లేయర్ నితీశ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది అద్భుతమైన ఆటతో అలరించిన నితీశ్, రానున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. 2024 ఐపీఎల్ సీజన్‌లో 303 పరుగులు, 3 వికెట్లతో రాణించిన నితీశ్ అక్కడనుంచి వెనక్కి తగ్గలేదు. బంగ్లాదేశ్‌తో రెండో టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ యువ ఆటగాడు, ఆ మ్యాచ్‌లో 74 పరుగులు అలాగే 2 వికెట్లతో సత్తాచాటాడు. ఈ నెల 31న ఆసీస్-ఎతో ప్రారంభమయ్యే సిరీస్‌లో భారత్-ఎ తరఫున బరిలో దిగుతున్న నితీశ్ తన కెరీర్ గురించి చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలుఅతడి మాటల్లోనే.
ఆస్ట్రేలియాపై భారత్ తరఫున ఆడటం నాకు చాలా ఆనందంగా ఉంది. గొప్ప ప్లేయర్స్‌తో కలిసి ఆడటం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. 2024 నాకు బాగా కలిసొచ్చింది. అంతకుముందు సరైన అవకాశం కోసం చాలా కాలం ఎదురుచూశాను. ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా మంచి అవకాశం లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకున్నాను. అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. మేటి ఆల్‌రౌండర్‌గా ఎదగడానికి నేను మరింత కష్టపడాలని అనుకుంటున్నాను. రానున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ముందు జరిగే ఎ- సిరీస్ నాకెంతో కీలకం. కంగారూ జట్టుతో పోరుకు ముందు ఆస్ట్రేలియాలో పిచ్‌లు, పరిస్థితులపై అవగాహన పెంచుకునేందుకు ఇది మంచి అవకాశం.
టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలనేది దేశంలో ప్రతి క్రికెటర్ కల. అయితే ప్రపంచంలోనే మేటి ఆల్‌రౌండర్ కావాలన్న లక్ష్యంతో నేను ఈ ఫీల్డ్‌లో సాగుతున్నాను. బౌలింగ్ పట్ల ఎక్కువ శ్రద్ధ వహించడానికి అది కూడా ఒక కారణం. బౌలింగ్‌లో ఇంకాస్త మెరుగుపడితే అత్యుత్తమ ఆల్‌రౌండర్ కావొచ్చని అనుకుంటున్నాను.