Hardik Pandya IPL 2024:2024 ఐపీఎల్లో హార్దిక్ పాండ్య సారథ్యంలోని ముంబయి ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే ఫ్లేఆఫ్స్ రేస్ నుంచి అధికారికంగా తప్పుకున్న ముంబయి తాజాగా కోల్‌కతాతో మ్యాచ్‌లో మరో ఓటమిని మూటగట్టుకుంది. కాగా, ఈ సీజన్లో ముంబయికి ఇది తొమ్మిదో ఓటమి. ఇక మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్దిక్ ఈ సీజన్లో తమ ప్రదర్శన గురించి మాట్లాడాడు.
'బౌలర్లు బాగానే రాణించారు. బ్యాటింగ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాం. శనివారం మ్యాచ్‌లోనూ అదే జరిగింది. బ్యాటింగ్ విభాగం శుభారంభం ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోలేక పోయాం. గ్రౌండ్ చాలా దారుణంగా మారిపోయింది. వర్షం పడినప్పటికీ బౌలర్లు మంచి ఆటతీరు కనబరిచారు. వాతావరణ పరిస్థితితుల వల్ల బంతి బౌండరీకి చేరుకోగానే తడిసిపోతూ ఉంది. ఇక సీజన్ ప్రారంభం నుంచి గెలవాలనే తపనతోనే ఆడాం. నాణ్యమైన క్రికెట్ ఆడాలనేదే నా సిద్ధాంతం. కానీ, ఈ సీజన్లో మేం అదే కోల్పోయాం. మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం. ఇక ఆఖరి మ్యాచ్‌లో బాగా ఆడి సీజన్‌ను ఘనంగా ముగిస్తాం' అని అన్నాడు.
శనివారం సాయంత్రం ఈడెన్ గార్డెన్స్‌లో వర్షం పడటం వల్ల మ్యాచ్ గంటన్నర ఆలస్యంగా మొదలైంది. దీంతో మ్యాచ్‌ను 16ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన పాండ్యా కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడిన కేకేఆర్ 16 ఓవర్లలో 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (40 పరుగులు) రాణించాడు. చేధనలో ముంబయి 16 ఓవర్లు ఆడి 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేయగలిగింది. వరుణ్ చక్రవర్తి (2/17) ముంబయిని దెబ్బకొట్టాడు.