Ravichandran Ashwin Test Career : ఆస్ట్రేలియా వేదికగా తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన అతడు గులాబీ టెస్టులో మాత్రమే ఆడాడు. మిగతా రెండు టెస్టుల్లో ఛాన్స్ రాకపోవచ్చనే అభిప్రాయంతోనే గుడ్‌బై చెప్పేశాడు. అయితే ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అశ్విన్. ఈ తరంలో ఆ ఘనతను అందుకున్న తొలి భారత క్రికెటర్‌గానూ రికార్డుకెక్కాడు. అయితే ఆ లిస్ట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పుజారా, రహానె తదితరులు కూడా ఉన్నప్పటికీ వారెవరూ రిటైర్‌మెంట్ తీసుకోలేదు. ఇంతకీ అదేంటంటే?
రవిచంద్రన్ అశ్విన్ సేనా (దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్) జట్లపై అద్భుత ప్రదర్శన చేశాడు. వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలతోనూ ఆడాడు. అయితే దాయాది దేశం పాకిస్థాన్‌తో మాత్రం అతడు తన కెరీర్‌లో ఇప్పటివరకూ ఒక్క టెస్టూ ఆడలేదు. దానికి కారణం భారత్ - పాక్ మధ్య ఉన్న సంబంధాలు సంక్లిష్టంగా మారడమే. దీని కారణంగా 2008 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. చివరిసారిగా ఇరు జట్ల మధ్య 2007లో టెస్టు జరిగింది. అయితే అశ్విన్ 2011లో అంతర్జాతీయ అరంగేట్రం చేయగా, టీ20లు, వన్డేల్లో పాక్‌తో తటస్థ వేదికల్లో భారత్ తలపడింది. ఇక రెండేళ్ల కిందట టీ20 ప్రపంచ కప్‌లో పాక్‌పై విన్నింగ్ షాట్‌ను అశ్విన్ కొట్టిన సంగతి తెలిసిందే.