Los Angeles Olympics 2028:పారిస్ ఒలింపిక్స్ సంబరాలు ముగిశాయి. ఎన్నో సంచలనాలు, మరెనో రికార్డులతోపాటు పలు వివాదాలతో 2024 ఒలింపిక్స్ గేమ్స్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఈ విశ్వ క్రీడలు దాదాపు రెండు వారాలు క్రీడా ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. మరి తర్వాత ఏంటి? ఇక అందరి దృష్టి 2028 విశ్వక్రీడలపైనే. లాస్‌ఏంజెలెస్ వేదికగా 2028 ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పారిస్ ముగింపు వేడుకల్లో ఐవోసీ ప్రెసిడెంట్ థామస్ ఒలింపిక్ పతకాన్ని లాస్ఏంజెలెస్ మేయర్ కారెన్‌కు అందించారు. ఇక 2028 ఒలింపిక్స్‌ను ఇంతకంటే ఘనంగా నిర్వహించేందుకు అమెరికా ఇప్పటికే కసరత్తులు మొదలెట్టింది. ఆటలకు హాలీవుడ్ గ్లామర్‌ను అద్దనుంది.
అమెరికా మూడోసారి
ఈ విశ్వక్రీడలకు ఆతిథ్యమిచ్చిన పారిస్ నుంచి మూడోసారి ఆతిథ్య నగరంగా మారబోతున్న లాస్‌ఏంజెలెస్ ఒలింపిక్ పతాకాన్ని అందుకుంది. ఇప్పటివరకూ లండన్ (1908, 1948, 2012), పారిస్ (1900, 1924, 2024) మాత్రమే ఒలింపిక్స్‌కు మూడు సార్లు ఆతిథ్యమిచ్చాయి. ఈ లిస్ట్‌లో లాస్ఏంజెలెస్ కూడా చేరబోతుంది. అమెరికా నగరంలో గతంలో 1932, 1984 ఒలింపిక్స్ జరిగాయి.
44 ఏళ్ల తర్వాత మరోసారి విశ్వక్రీడలకు ఆతిథ్యమివ్వబోతున్న ఈ నగరం క్రీడలను అత్యుత్తమంగా నిర్వహించాలనే ప్రణాళికతో ఉంది. పసిఫిక్ మహాసముద్రం, బీచ్‌లు, ఆకట్టుకునే వీధులతో క్రీడా ప్రపంచాన్ని మంత్రముగ్దులను చేసేందుకు లాస్‌ఏంజెలెస్ సమయాత్తమవుతోంది. పారిస్ లాగే లాస్‌ఏంజెలెస్ కూడా ఒలింపిక్స్ కోసం ఎక్కువగా కొత్త నిర్మాణాలు చేపట్టడం లేదు. 2028 జులై 14న ప్రారంభమయ్యే ఈ ఒలింపిక్స్ క్రీడలు జులై 30న ముగుస్తాయి.