Lakshya Sen Semi Final: 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ సూపర్ ఫామ్‌తో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ క్రమంలో విశ్వ క్రీడల్లో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఈవెంట్లో సెమీస్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారత షట్లర్‌గా లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చో చెన్ (తైవాన్)పై 19-21, 21-15, 21-12 నెగ్గి పతకానికి అడుగు దూరంలో నిలిచాడు. ఇక రాబోయే మ్యాచ్‌ల్లో కూడా ఇలాగే అదరగొట్టి పతకాన్ని పట్టేయాలని భారత్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి సెమీస్‌లో లక్ష్యసేన్ ఎవరిని ఢీ కొట్టనున్నాడో తెలుసా?
కీలమైన సెమీస్ పోరులో లక్ష్యసేన్ డెన్మార్క్ షట్లర్ విక్టర్ ఆక్సెల్సెన్ (Viktor Axelsen)తో తలపడనున్నాడు. ఆక్సెల్సెన్ కూడా ఈ ఒలింపిక్స్‌లో అజేయంగా లేకుండా సెమీస్‌కు దూసుకొచ్చాడు. అతడు గ్రూప్ స్టేజ్‌లో నేపాల్, ఇజ్రాయెల్, ఐర్లాండ్ ప్లేయర్లపై నెగ్గాడు. కాగా, క్వార్టర్ ఫైనల్లో సింగపుర్ షట్లర్ కే వై లోక్‌పై 21-9, 21-17 తేడాతో విజయం సాధించి జోరుమీదున్నాడు. అంతేకాకుండా 2020 ఒలింపిక్స్ పరుషుల బ్యాట్మింటన్ సింగిల్స్‌లో విక్టర్ ఆక్సెల్సెన్ స్వర్ణ పతకం దక్కించుకున్నాడు. దీంతో సెమీఫైనల్లో లక్ష్యసేన్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది.
వీరిద్దరి మధ్య సెమీస్ పోరు ఆదివారం (ఆగస్టు 04) మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. సెమీస్‌లో లక్ష్యసేన్ విజయం సాధిస్తే పతకం ఖరారవుతుంది. అతడు ఫైనల్ పోరులో స్వర్ణ పతకం కోసం పోటీపడాల్సి ఉంటుది. ఒకవేళ సెమీ ఫైనల్లో లక్ష్య ఓడితే కాంస్యం కోసం ఆడాల్సి ఉంటుంది.