Ishan Kishan Duleep Trophy 2024:టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ డొమెస్టిక్ టోర్నీలో అదరగొట్టాడు. రీ ఎంట్రీలో వచ్చీ రాగానే శతకంతో అదరగొట్టాడు. దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా సి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇషాన్ గురువారం ఇండియా బి టీమ్‌పై సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో 111 పరుగులతో ఇషాన్ రాణించాడు. అందులో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఇక ముకేశ్ కుమార్ అద్భుత బంతికి ఇషాన్ క్లీన్ బౌల్డయ్యాడు. గాయం కారణంగా ప్రస్తుత దులీప్ ట్రోఫీలో ఇషాన్ తొలి రౌండ్ ఆడలేదు. నేరుగా రెండో రౌండ్లోనే బరిలోకి దిగాడు. అలా రావడంతోనే సెంచరీ బాది సత్తా చాటుకున్నాడు.
అయితే బీసీసీఐ సెంట్రస్ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గతేడాది సౌతాఫ్రికా పర్యటన నుంచి మధ్యలోనే వచ్చేసిన ఇషాన్ ఆ తర్వాత టీమ్ఇండియాకు దూరమయ్యాడు. భారత జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీలో ఆడాల్సిందేనన్న బీసీసీఐ నిబంధనలు పట్టింకోలేదు. దీంతో అతడి కాంట్రాక్ట్ సైతం పోయింది. ఇక మళ్లీ డొమెస్టిక్ టోర్నీల్లో ఆడడడం ప్రారంభించిన ఇషాన్ బ్యాట్‌తో రాణించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫామ్ ఇలాగే కొనసాగిస్తే, టీమ్ఇండియాలోకి త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వవచ్చనని అంటున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా సి జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సరికి 79 ఓవర్లకు 357- 5 స్కోర్‌తో ఉంది. ఇషాన్ కిషన్ (112 పరుగులు), బాబా ఇంద్రజీత్ (78 పరుగులు) రాణించారు. సాయి సుదర్శన్ (43 పరుగులు), రజత్ పటీదార్ (40 పరుగులు) ఆకట్టుకున్నారు. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్ (46 పరుగులు), మానవ్ సుతార్ (8 పరుగులు) ఉన్నారు. ఇండియా బి బౌలర్లలో ముకేశ్ కుమార్ 3 వికెట్లతో అదరగొట్టగా, నవ్‌దీప్ సైనీ, రాహుల్ చాహర్ తలో వికెట్ దక్కించుకున్నారు.