IPL 2025 KL Rahul Retention : ఐపీఎల్ 2025 సీజన్ రిటెన్షన్‌కు సంబంధించి ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఫుల్ హాట్ టాపిక్‌గా మారింది. ఏ ఫ్రాంచైజీ ఎవరిని అట్టి పెట్టుకుంది? ఎవరిని మెగా వేలంలోకి వదలనుంది? అనేది ప్రస్తుతం క్రికెట్ లవర్స్‌లో ఆసక్తికరంగా మారింది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం తమ కెప్టెన్లను ఒకటీ, రెండు ఫ్రాంచైజీలు తప్ప మిగతా జట్లు రిటైన్ చేసుకుంటాయని క్రికెట్ వర్గాల నుంచి తెలుస్తోంది. అయితే రిటైన్ చేసుకోనివారిలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ముందువరుసలో ఉన్నాడని తెలిసింది.
ఎందుకంటే గత సీజన్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ దారుణమైన ప్రదర్శన చేసింది. ఆ సమయంలో కేఎల్‌పై లఖ్‌నవూ ఓనర్ సంజీవ్ గోయెంకా అసహనం కూడా వ్యక్తం చేస్తూ కనిపించాడు. ఆ తర్వాత గోయెంకా ఈ విషయాన్ని కొట్టిపారేశాడు. కానీ అదే సమయంలో కేఎల్‌ను ఇక పక్కన పెట్టేస్తారనే కొత్త చర్చ కూడా తెరపైకి వచ్చింది.
అయితే ఇప్పుడు అది నిజమే అని తెలుస్తోంది. ఎల్‌ఎస్‌జీ మెంటార్ జహీర్‌ఖాన్ ఓ నివేదికను సిద్ధం చేశారట. దాని ప్రకారం చూస్తే కేఎల్ రాహుల్‌ను వదిలేయడం ఖాయమేనని స్పష్టమవుతోందని ఐపీఎల్ వర్గాలు అంటున్నాయి. దీంతో కేఎల్ రాహుల్ మెగా ఆక్షన్‌లోకి దిగుతాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
"లాస్ట్ సీజన్‌లో లఖ్‌నవూ ప్రదర్శనపై ఎల్‌ఎస్‌జీ మేనేజ్మెంట్తో పాటు మెంటార్ జహీర్ ఖాన్, కోచ్ జస్టిన్ లాంగర్ ఓ నివేదిక రెడీ చేశారు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో జట్టు నాకౌట్ దశకు చేరుకోవడంలో ఫెయిల్ అయింది. జట్టు ఓటముల్లో బ్యాటర్‌గా కేఎల్ పాత్రపై రిపోర్ట్ రెడీ చేసింది. అందుకే అతడిని పక్కన పెట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మిడిల్ ఓవర్లలో రాహుల్ చాలా నెమ్మదిగా ఆడాడు. జట్టు భారీ స్కోరు చేయకుండా ఉండేందుకు అతడు ఓ ప్రధాన కారణమని తేల్చినట్లు సమాచారం. ఇంపాక్ట్ రూల్‌తో ఇతర జట్లన్నీ భారీ స్కోర్లు చేశాయి. కానీ లఖ్‌నవూ మాత్రం వెనకబడిపోయింది. టాప్ ఆర్డర్‌లో ఎక్కువ బంతులు వృథా అవ్వడం వల్ల కూడా మిగతా బ్యాటర్లపై ఆ ప్రభావం పడింది" అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.