Indias Richest Female Cricketer :మన దేశంలో ఉమెన్స్ క్రికెట్ టీమ్‌కు కూడా ఫాలోయింగ్ పెరుగుతోంది. కొందరు మహిళా క్రికెటర్లు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. వారిలో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఒకరు. ఆమె ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపిఎల్)లో ముంబయి ఇండియన్స్ (ఎంఐ) కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం 2024 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో టీమ్‌ని నడిపిస్తోంది. దేశానికి తొలి ట్రోఫీ అందించే కలను నెరవేర్చుకోవడానికి పోరాడుతోంది. ఇప్పుడు ఈ స్టార్ ఉమెన్ క్రికెటర్ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్, ఆమె సంపాదన, ఇతర వివరాలు తెలుసుకుందాం.
1989 మార్చి 8న పంజాబ్‌లో జన్మించింది హర్మన్‌ప్రీత్. క్రికెట్‌లో తన పవర్‌ఫుల్ బ్యాటింగ్, కెప్టెన్సీతో గుర్తింపు పొందింది. 2022 బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో జట్టుకు రజత పతకం గెలవడం సహా అనేక విజయాలను అందించింది. క్రికెట్‌లో ఆమె ఎదుగుదల ఆమెను స్టార్‌గా మార్చడమే కాకుండా భారీగా అభిమానులను సంపాదించిపెట్టింది.
కెరీర్‌లో కీలక విజయాలు
హర్మన్‌ప్రీత్ కౌర్ క్రికెట్ కెరీర్ 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేయడంతో ప్రారంభమైంది. అప్పటి నుంచి 130 వన్డేలు, 161 టీ20లు, 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. వన్డేల్లో 3410 పరుగులు, టీ20ల్లో 3204 పరుగులు, టెస్టుల్లో 131 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన 2017 మహిళల ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో కౌర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమె అజేయంగా 171 పరుగులు చేసి భారత్‌ను విజయపథంలో నడిపించింది.
కౌర్ బ్యాటర్‌గానే కాకుండా కెప్టెన్‌గానూ సేవలు అందిస్తోంది. ఆమె కెప్టెన్‌గా 2020 టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లింది. 2022లో కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని సాధించింది. ఆమె నాయకత్వానికి గుర్తుగా 2017లో అర్జున అవార్డు సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకుంది.
హర్మన్‌ప్రీత్ కౌర్ నెట్ వర్త్ ఎంతంటే?
కొన్ని నివేదికలు హర్మన్‌ప్రీత్ కౌర్ భారత మహిళా క్రికెటర్లలో అత్యంత ధనవంతురాలని పేర్కొంటున్నాయి. 2024 నాటికి ఆమె నెట్ వర్త్ దాదాపు రూ.24 కోట్లుగా అంచనా వేస్తున్నాయి. ఆమె సంపాదన ఎక్కువగా క్రికెట్ జీతం, మ్యాచ్ ఫీజులు, వివిధ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుంచి వస్తోందని సమాచారం.