India Legends vs Pakistan Legends Final:2024 వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో టీమ్ఇండియా లెజెండ్స్ జట్టు విజేతగా నిలిచింది. పాకిస్థాన్ లెజెండ్స్‌తో బర్మింగమ్ వేదికగా శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని భారత్ లెజెండ్స్ 5 వికెట్ల తేడాతో నెగ్గి జయకేతనం ఎగురవేశారు. ప్రత్యర్థి పాక్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 19.1 ఓవర్లలోనే ఛేదించి లెజెండ్స్ టోర్నీలో ఛాంపియన్స్‌గా నిలిచింది. ఫైనల్లో అదరగొట్టిన అంబటి రాయుడుకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', యూసుఫ్ పఠాన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' అవార్డులు లభించాయి.
మెరిసిన రాయుడు
158 పరుగుల లక్ష్య ఛేదనలో తెలుగు తేజం అంబటిరాయుడు (50 పరుగులు; 30బంత్లులో: 5x4, 6x2) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్ రాబిన్ ఊతప్ప (10 పరుగులు), సురేశ్ రైనా (4 పరుగులు) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. గుర్‌కీతర్ మన్ సింగ్ (34 పరుగులు) రాణించాడు. చివర్లో యూసుఫ్ పఠాన్ (30 పరుగులు; 16 బంత్లులో: 1x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. యువరాజ్ సింగ్ (15*), ఇర్ఫాన్ పఠాన్ (5*) మ్యాచ్ ముగించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఆమిర్ యామిన్ 2, సయిద్ అజ్మల్, వహాబ్ రియాజ్, షోయబ్ మాలిక్ తలో వికెట్ దక్కించుకున్నారు.
లెజెండ్స్ అదుర్స్:టీమ్ఇండియా మాజీ ప్లేయర్లు ఈ లెజెండ్స్ టోర్నీలో పాల్గొన్నారు. రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, పఠాన్ బ్రదర్స్ టోర్నీలో రాణించారు. ముఖ్యంగా సెమీస్‌లో ఇర్ఫాన్ పఠాన్ కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులతో ఆస్ట్రేలియాను రఫ్పాడించాడు. కాగా, ఫైనల్లో అంబటి రాయుడు అదరగొట్టాడు.