Ind vs Eng Test 2024 Record:ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే దక్కించుకుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఘనత అందుకున్నాడు. ఇంగ్లాండ్ బజ్‌బాల్ వ్యూహంతో ఆడడం ప్రారంభించిన తర్వాత ఆ జట్టును ద్వైపాక్షిక సిరీస్‌లో ఓడించిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు రోహిత్. అటు ఇంగ్లాండ్ కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్, కోచ్‌గా మెక్కల్లమ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ జట్టు టెస్టు సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి.
బజ్‌బాల్ వ్యూహంతో టెస్టుల్లో ఇంగ్లాండ్ సంచలన విజయాలు నమోదు చేసింది. బజ్‌బాల్ వ్యూహంతో ఇంగ్లాండ్ ఇప్పటివరకు 8 సిరీస్‌లు ఆడింది. అందులో 4 సిరీస్‌లు నెగ్గగా, 3 సిరీస్‌లను డ్రా చేసుకుంది. ఇదే వ్యూహంతో భారత్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ తొలిసారి సిరీస్‌ను చేజార్చుకుంది. ప్రస్తుత సిరీస్‌లో ఇంగ్లాండ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా వరుసగా మూడు టెస్టుల్లో ఓడడం కూడా ఇదే తొలిసారి. బజ్‌బాల్ ఆటతో ప్రత్యర్థులను భయపెట్టిన ఇంగ్లాండ్‌కు టీమ్ఇండియా భారత గడ్డపై షాక్ ఇచ్చింది.
రోహిత్@4000: రోహిత్ ఇదే టెస్టులో మరో ఘనత సాధించాడు. మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ టెస్టుల్లో 4000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. 58 టెస్టులు ఆడిన రోహిత్ 100 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయికి చేరుకున్నాడు. ఇప్పటిదాకా 100 ఇన్నింగ్స్‌ల్లో 4034 పరుగులు చేశాడు. అందులో 11 సెంచరీలు. 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.