Ind vs Eng 2nd Test 2024: భారత్- ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో రోజు ఆఖరి సెషన్లో ఆట ప్రారంభించిన భారత్ స్కోర్ వేగం పెంచింది. జైశ్వాల్ (15), రోహిత్ శర్మ (13) క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ 5 ఓవర్లకు 28-0 తో నిలిచింది. దీంతో భారత్ ప్రస్తుతం 171 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది.
అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 55.5 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ క్రాలీ (76 పరుగులు), కెప్టెన్ బెన్‌స్టోక్స్ (47 పరుగులు) ఇద్దరే రాణించారు. ఇక టీమ్ఇండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్ల ప్రదర్శనతో అదరహో అనిపించాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ 3, అక్షర్ పటేల్ 1 వికెట్ దక్కించుకున్నారు.
రెండో రోజు లంఛ్కు ముందు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ తొలి నుంచే ధాటిగా పరుగులు చేసింది. బజ్‌బాల్ వ్యూహాన్ని అమలు చేస్తూ ఇంగ్లాండ్ బ్యాటర్లు చకచకా పరుగులు సాధించారు. ఈ క్రమంలో 59 పరుగుల వద్ద బెన్ డకెట్ (21)ను కుల్దీప్ ఔట్ చేసి టీమ్ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా ఇంగ్లాండ్ జోరు కొనసాగించింది. మరో ఓపెనర్ జాక్ క్రాలీ (76) హాఫ్ సెంచరీతో స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఇక అక్షర్ క్రాలీని బోల్తా కొట్టించి పెవిలియన్ చేర్చాడు.