Ind vs Eng 2nd Test 2024:భారత్- ఇంగ్లాండ్ రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 67-1తో ఉంది. ఇంగ్లాండ్ ఇంకా 332 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో జాక్ క్రాలీ (28), రెహాన్ అహ్మద్ (9) ఉన్నారు. బెన్ డకెట్ (28) ఔటయ్యాడు. అశ్విన్ వికెట్ దక్కించుకన్నాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 4, రెహాన్ అహ్మద్ 3, జేమ్స్ అండర్సన్ 2, షోయబ్ బాషిర్ 1 వికెట్ పడగొట్టారు.
గిల్ సూపర్ సెంచరీ: 28-0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (13), యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ (17) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఈ ఇద్దరినీ పేసర్ జేమ్స్ అండర్సన్ ఔట్ చేశాడు. ఇక బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ (29), రజత్ పటీదార్ (9) మరోసారి నిరాశ పర్చారు. ఈ క్రమంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌తో కలిసి గిల్ 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే చాలాకాలం తర్వాత గిల్ టెస్టుల్లో సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో తన ఫామ్‌పై వస్తున్న అనుమానాలను గిల్ ఒక్కసారిగా పటాపంచలు చేశాడు.
మరోవైపు అక్షర్ పటేల్ (45) అద్భుతంగా రాణించాడు. గిల్‌కు అక్షర్ చక్కటి సహకారం అందించడం వల్ల టీమ్ఇండియా స్కోర్ 200 దాటింది. ఇక షోయబ్ బషీర్ బౌలింగ్‌లో గిల్, కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. కొంత సేపటికే అక్షర్ కూడా ఔటయ్యాడు. సొంతగడ్డపై సత్తాచాటే ఛాన్స్ వచ్చినా భరత్ (6) మరోసారి ఫెయిలయ్యాడు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్ (29 పరుగులు) రాణించడం వల్ల భారత్ 250+ మార్క్ అందుకుంది.
భారత్ తొలి ఇన్నింగ్స్- 396/10