IND VS BAN First T20 : టీమ్ ఇండియా - బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. అక్టోబర్ 6 నుంచి మొదలు కానుంది. మొదటి టీ20 అక్టోబర్ 6న గ్వాలియర్ వేదికగా జరగనుంది. రెండో టీ20 అక్టోబర్ 9న దిల్లీ వేదికగా, మూడో టీ20 అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా జరుగనున్నాయి. ఇక ఈ సిరీస్ కోసం ఇప్పటికే టీమ్ ఇండియా, బంగ్లాదేశ్ జట్లను ప్రకటించారు.
అయితే మొదటి టీ20 ప్రారంభానికి మరో రెండు రోజుల సమయమే మిగిలి ఉంది. దీంతో ఆ మ్యాచ్ కోసం తుది జట్టులో ఎవరు ఉంటారన్న విషయంపై ఊహాగానాలు మొదలైపోయాయి. ఈ సిరీస్ కోసం ఇప్పటికే సీనియర్లకు విశ్రాంతిని ఇచ్చారు భారత సెలెక్టర్లు. యువ జట్టును సెలెక్ట్ చేశారు. ఈ టీమ్‌కు సూర్యకుమార్ నాయకత్వం వహిస్తున్నాడు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్య, రియాన్ పరాగ్, శివమ్ దూబె, రింకూ సింగ్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ యాదవ్, అర్షదీప్ సింగ్, జితేశ్ శర్మ, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.
ఓపెనర్లుగా ఆ ఇద్దరు - యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారని తెలిసింది. వన్ డౌన్‌లో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, ఆ తర్వాత రియాన్ పరాగ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ వరుసగా క్రీజులోకి వచ్చే అవకాశం ఉంది.
అతడికి ఎదురుచూపు! - పేస్ ఆల్‌రౌండర్లుగా హార్దిక్, దూబే తుది జట్టులో ఉండటం దాదాపుగా ఖరారైంది. దీంతో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి ఎదురుచూపులు తప్పేలా లేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో రవి బిష్ణోయ్ ఎంపిక దాదాపుగా ఖరారు అయినట్టే. వరుణ్ చక్రవర్తికి నిరాశ తప్పదు. పేసర్ల కోటాలో అర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్ తుది జట్టులో ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది.