Border Gavaskar Trophy 2024 First Test Pitch :బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. మరో మూడు రోజుల్లో టీమ్ ఇండియా - ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచుల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం వేదికగా జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌కు ఆస్ట్రేలియా గ్రీన్ పిచ్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఓ నివేదిక ప్రకారం, ఆప్టస్ అవుట్‌ఫీల్డ్, పిచ్ ఇప్పటికీ చాలా పచ్చగా కనిపిస్తోంది. అంటే ఇలాంటి పిచ్‌లు ఫాస్ట్ బౌలర్‌లకు అనుకూలంగా ఉంటాయి. ఆస్ట్రేలియా పేస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, కెప్టెన్ పాట్ కమిన్స్ మొదటి టెస్ట్‌లో భారత జట్టుకు సవాలు విసిరే అవకాశం ఉంది. పిచ్ పేసర్లకు సహకరించే అవకాశం ఉండటంతో టీమ్ ఇండియా ఒక స్పిన్నర్‌తో మాత్రమే బరిలో దిగే అవకాశం ఉంది.
పేస్-బౌలింగ్ ఆల్-రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు అరంగేట్రం చేయబోతున్నట్లు ఇప్పటికే కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. పిచ్ కండిషన్ ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. రవీంద్ర జడేజా లేదా రవిచంద్రన్ అశ్విన్‌లో ఒకరు మొదటి టెస్టు ఆడకపోవచ్చని సమాచారం.
ఆస్ట్రేలియా పేస్‌ను ఎదుర్కోగలరా? -పేస్‌కు అనుకూలించే పరిస్థితులు భారత బ్యాటింగ్ లైనప్‌కు సవాలు విసరవచ్చు. కెప్టెన్ రోహిత్ శర్మ, నంబర్ 3 రెగ్యులర్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ మొదటి టెస్ట్‌కు అందుబాటులో ఉండరు. రోహిత్‌కు ఇటీవల రెండో సంతానంగా కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ ఇంకా ఆస్ట్రేలియాకు చేరుకోలేదు. ప్రాక్టీస్ సమయంలో బొటనవేలు ఫ్రాక్చర్ కావడంతో గిల్ మొదటి టెస్ట్‌కు అందుబాటులో ఉండడు.