ICC T20 World Cup 2024 :ఈ ఏడాది జూన్ 1న మొదలయ్యే టీ20 వరల్డ్ కప్‌కి యూఎస్, వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. యునైటెడ్ స్టేట్స్‌లో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రయత్నిస్తోంది. న్యూయార్క్‌లో జరిగే T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చేందుకు ఐసీసీ చర్యలు తీసుకుంటోంది.
US ప్రతి సంవత్సరం క్రీడల కోసం చాలా డబ్బు ఖర్చు చేసే పెద్ద స్పోర్ట్స్ మార్కెట్ అయినప్పటికీ, అక్కడ క్రికెట్‌కి పెద్దగా ఆదరణ లభించలేదు. యుఎస్ జాతీయ క్రికెట్ జట్టు పెద్దగా విజయాలు సాధించలేదు. మయామిలో భారత్‌తో ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లు, మేజర్ లీగ్ క్రికెట్ అనే కొత్త లీగ్ ఉన్నప్పటికీ క్రికెట్‌పై దేశ ఆసక్తిని పెంచలేకపోయాయి.
అదే వేదికగా ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్
యుఎస్‌లో క్రికెట్‌ను బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగం అవుతుంది. 2024లో ఐసీసీ మొదటిసారిగా మెగా టోర్నీ టీ20 వరల్డ్ కప్‌ని యూఎస్‌కి తీసుకొచ్చింది. వరల్డ్ కప్ యూఎస్‌లో క్రికెట్‌కు మంచి ఊపు తీసుకొస్తుందని భావిస్తున్నారు. యుఎస్‌లో క్రికెట్‌ను పాపులర్ చేసే ఉద్దేశంతోనే 2024 T20 ప్రపంచ కప్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ను వెస్టిండీస్‌లో కాకుండా ఉత్తర అమెరికాలో నిర్వహిస్తున్నారు.
భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఇప్పటికే స్టేడియంలు ఉన్న ఫ్లోరిడా లేదా డల్లాస్‌లో కాకుండా న్యూయార్క్‌లో జరుగుతుంది. ఫ్లోరిడా, మయామిలోని లాడర్‌హిల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం సామర్థ్యం 20,000, డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియం కెపాసిటీ 7,500 మాత్రమే. వీటికి బదులుగా మ్యాచ్ కోసం న్యూయార్క్‌లో తాత్కాలిక స్టేడియం నిర్మించబోతున్నారు.
ఒకే స్టేడియంలో అత్యధిక మ్యాచ్‌లు
మరింత మంది అభిమానులను ఆకర్షించడానికి, మ్యాచ్‌ను న్యూయార్క్‌లో 34,000 మంది ప్రేక్షకులు వీక్షించేలా సరికొత్త తాత్కాలిక స్టేడియంలో నిర్వహించనున్నారు. లాంగ్ ఐలాండ్, న్యూయార్క్, నాసావు కౌంటీలోని ఐసెన్‌హోవర్ పార్క్‌లో ఈ ప్రత్యేక స్టేడియం ఏర్పాటు కానుంది. ఇది క్రికెట్‌కు మొదటి మాడ్యులర్ స్టేడియం, అంటే దీన్ని ఈజీగా వేరు చేయవచ్చు, తిరిగి ఏర్పాటు చేయవచ్చు. మే నెలాఖరులోగా దీన్ని సిద్ధం చేయనున్నారు.