తెలంగాణ

telangana

ETV Bharat / sports

డేంజర్​లో షమీ టెస్ట్​ కెరీర్​! - రీఎంట్రీ ఎప్పుడో?

టీమ్ ఇండియా పేసర్ షమీని వేధిస్తున్న గాయాల బెదడ - సందిగ్ధంలో పడిన అతడి టెస్ట్ కెరీర్​!

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

Mohammed Shami Test Career
Mohammed Shami Test Career (source Getty Images)

Mohammed Shami Test Career : టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ షమీని గాయాల బెడద వదలడం లేదు. ఫిట్​గా కోలుకుని జట్టులోకి వద్దామనుకునే ప్రతిసారి గాయం మళ్లీ తిరగబెడుతోంది. దాదాపు ఏడాదిగా జట్టుకు దూరమైన షమీ, స్వదేశంలో కివీస్​తో ఆడబోయే సిరీస్ కోసం తీవ్రంగా శ్రమించాడు. కానీ ఫలితం లేకపోయింది.

ఏడాదికి జట్టుకు దూరం -వన్డే ప్రపంచ కప్‌ 2023లో ఆలస్యంగా భారత తుది జట్టులోకి వచ్చిన షమీ అదరగొట్టాడు. ఎవరూ ఊహించని విధంగా టాప్ వికెట్ టేకర్​గా నిలిచాడు. అయితే ఐసీసీ టోర్నీలంటేనే రెచ్చిపోయే షమీని మోకాలి గాయం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత సర్జరీ చేయించుకొని విశ్రాంతి తీసుకున్న షమీ, రంజీ బరిలోకి దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

మళ్లీ తిరగబెట్టిన మోకాలి గాయం! -రంజీల్లో ఫిట్ నెస్ సాధించి కనీసం కివీస్​తో సిరీస్‌కైనా పునరాగమనం చేద్దామని అనుకున్నాడు. తీరా సిద్ధమై వస్తుండగా, తన మోకాలి గాయం మళ్లీ తిరగబెట్టింది. న్యూజిలాండ్​తో సిరీస్‌తోనే కాకుండా ఏకంగా ఆసీస్ పర్యటనకూ కష్టమేనని తేలిపోయింది. షమీ రీఎంట్రీ ఎప్పుడు? బీసీసీఐ వైద్యబృందం ఏం చేస్తుందనేది అభిమానుల నుంచి ప్రశ్నలు తలెత్తాయి.

నో ఫిట్ నెస్ -దాదాపు 10 నెలల తర్వాత మైదానంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యాడు షమీ. అయితే అతడికి తాజాగా అనుకోని రీతిలో అడ్డు ఎదురైంది. ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడే మోకాలిలో వాపు వచ్చినట్లు గుర్తించారు. వెంటనే దానిని బీసీసీఐ వైద్య బృందం నిశితంగా పరిశీలించింది. జాతీయ క్రికెట్ అకాడమీకి పంపి వైద్య పరీక్షలు చేయించింది. 34 ఏళ్ల షమీ వంద శాతం ఫిట్‌ నెస్‌తో లేడని వైద్య పరీక్షల్లో తెలిసింది. దీంతో షమీ టెస్టు కెరీర్ మరింత ప్రమాదంలో పడింది.

'షమీ విషయంలో ఆ రిస్క్ తీసుకోలేం' -ఫిజియో, వైద్యులతో కలిసి టీమ్ ఇండియా పేసర్ షమీ తీవ్రంగా శ్రమిస్తున్నాడని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. షమీ విషయంలో రిస్క్‌ తీసుకోదల్చుకోవడం లేదని పేర్కొన్నాడు. షమీని ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకెళ్లడం కూడా కష్టమేనని అభిప్రాయపడ్డాడు. షమీ వందశాతం ఫిట్‌నెస్‌తో ఉండాలనేదే తమ ఆకాంక్ష అని, అతడి మోకాలి గాయం మళ్లీ తిరగబెట్టిందని వెల్లడించాడు. అయితే రోహిత్ వ్యాఖ్యలతో షమీ త్వరలో జరగబోయే బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి దూరం అవ్వనున్నట్లు తెలుస్తోంది.

బీసీసీఐ అఫిషియల్ అనౌన్స్ మెంట్? -అయితే, షమీ రీఎంట్రీ, గాయంపై ఇప్పటివరకు బీసీసీఐ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. షమీ ఎప్పటికి కోలుకుంటాడు? ఎప్పుడు మళ్లీ ఆడతాడు? అనే ప్రశ్నలకు ఆ ప్రకటన తర్వాతే సమాధానం దొరికే అవకాశం ఉంది. వైద్యబృందం మాత్రం తీవ్రంగానే కష్టపడుతోంది. షమీని త్వరగా సిద్ధం చేసే విషయంలో తీవ్రంగా కృషి చేస్తోంది.

షమీ ఉంటే సూపర్ -ప్రస్తుతం టీమ్ ఇండియాలో మంచి పేసర్లు ఉన్నారు. బుమ్రా, సిరాజ్‌తో పాటు యువ బౌలర్ ఆకాశ్‌దీప్‌ కూడా ఉన్నాడు. బంగ్లా టెస్టు సిరీస్‌లో వీరు అదరగొట్టారు. అయితే, ఆసీస్‌ పర్యటనలో మాత్రం కనీసం నలుగురు స్పెషలిస్ట్‌ పేసర్లు ఉంటేనే వర్కౌట్ అవుతుందనేది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. షమీ కూడా జట్టుతోపాటు చేరితే పేస్‌ విభాగం మరింత దుర్భేద్యంగా మారేదని అంటున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా పిచ్‌లపై కట్టుదిట్టంగా బంతులేసే షమీ మరింత ప్రమాదకరంగా మారేవాడు. షమీకి ఆసీస్‌లో మంచి రికార్డే ఉంది. కేవలం 8 టెస్టుల్లోనే 37 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు.

బయటకు వెళ్తే అంత ఈజీ కాదు -ఏ ఆటగాడైనా భారత జట్టు నుంచి ఒక్కసారి బయటకువెళ్తే, మళ్లీ రీఎంట్రీ అంత సులభం కాదు. ఇందులో రెండు అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఆ ఆటగాడు ఉంటేనే మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా గెలుస్తుందనే పరిస్థితి, ఆ ప్లేయర్‌కు పోటీనిచ్చే కుర్రాళ్లు ఫామ్‌లో లేకపోవడం రెండో కారణం. కానీ, ఈ రెండు పరిస్థితుల్లో భారత్‌ లేదనేది అందరికీ తెలిసిన వాస్తవం.

యువ క్రికెటర్లు తమ అవకాశాల కోసం కాచుకొని ఉన్నారు. ఈ రేసులో ఎంతటి సీనియర్‌తోనైనా పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నారనేది ఇప్పుడు టీమ్‌ఇండియాను చూస్తే అర్థమవుతోంది. మరోవైపు ప్రధాన కోచ్‌ గంభీర్‌ కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేందుకు ముందుంటాడు. అలాగని సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేయడు. అయితే, షమీ మళ్లీ జాతీయ జట్టులోకి రావాలంటే గాయం నుంచి కోలుకున్న తర్వాత రంజీ క్రికెట్ లో తన సత్తా ఏంటో నిరూపించుకోవాలి. ఈ ఏడాది షమీని మళ్లీ మైదానంలో చూస్తామనుకోవడం కష్టమే.

బీసీసీఐ సంచలన నిర్ణయం - కెప్టెన్ హర్మన్​ప్రీత్​పై వేటు!

భారత్. న్యుజిలాండ్​ తొలి టెస్ట్​ - OTTలో ఎక్కడ చూడాలంటే?

ABOUT THE AUTHOR

...view details