Hotspot Technology In Cricket :పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ (26 పరుగులు) కీలక దశలో ఔటయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అయితే ఆ బంతి బ్యాటుకు తాకిందా లేదా అనేది డౌట్! బంతి బ్యాటుకు తాకినట్లు స్నికో మీటర్‌లో స్పైక్ చూపిస్తున్నప్పటికీ, అదే సమయంలో అది ప్యాడ్ కుడా తాకినట్లు అనిపిస్తోంది. అయితే బ్యాట్ తన ప్యాడ్‌కు తాకడం వల్లే ఆ స్పైక్ వచ్చిందనేది రాహుల్ వాదన.
కానీ, ఆయా యాంగిల్స్‌లో పరిశీలించిన థర్డ్ అంపైర్ మాత్రం రాహుల్‌ను ఔట్‌గా నిర్ధరించాడు. ఈ నేపథ్యంలోనే పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. థర్డ్ అంపైర్ ఇంకా కొన్ని కోణాల్లో చూసి నిర్ణయం చెప్పి ఉండాల్సిదని అభిప్రాయపడుతున్నారు. అలాగే 'హాట్‌స్పాట్' టెక్నాలజీ వాడి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు అనేది మరికొందరి వాదన. దీంతో ఈ 'హాట్‌స్పాట్' పేరు తెరపైకి వచ్చింది. మరి ఈ హాట్‌స్పాట్ అంటే ఏంటి? ఇది దేనికి వాడుతారు? అనే చర్చ మొదలైంది. మరి ఈ టెక్నాలజీ ఏంటంటే?
అసలేంటీ హాట్‌స్పాట్?
బ్యాటర్‌ను ఎక్స్‌రే ఫిల్మ్ (బ్లాక్ అండ్ వైట్) తరహాలో చూపించడమే హాట్‌స్పాట్ ప్రత్యేకత. ఆ సమయంలో బ్యాటుకు బంతి తగిలినప్పుడు వైట్ స్పాట్ (తెల్లని మార్క్) పడుతుంది. దీంతో బ్యాటుకు బంతికి తగిలిందా లేదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ టెక్నాలజీని ఉపయోగించి ఎల్‌బీడబ్ల్యూ ఔట్‌లను కూడా నిర్ణయించవచ్చు. ప్యాడ్‌కి బంతి ఎక్కడ తగిలింది అనేది హాట్‌స్పాట్‌తో క్లియర్‌గా తెలుసుకోవచ్చు. దీని కోసం ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు వాడుతారు. ఇవి ప్రతీ ఫ్రేమ్‌ను క్యాప్చర్ చేసి ఒక వీడియోగా అందిస్తాయి. నవంబరు 23, 2006న గబ్బాలో జరిగిన ఇంగ్లాండ్ టెస్టులో తొలిసారి ఈ టెక్నాలజీని వాడారు.
తీసుకొచ్చింది ఎవరు?
2006లో బీబీజీ అనే స్పోర్ట్స్ సంస్థ ఈ టెక్నాలజీని తీసుకొచ్చింది. ఆ తర్వాత 2012లో ఎస్‌ఎల్‌ఎక్స్ హాక్ థర్మల్ ఇమేజింగ్ కెమెరాలతో దీన్ని అప్డేట్ చేశారు. ప్రస్తుతం ఇదే సర్వీస్ అందుబాటులో ఉంది. దీనిని సెలెక్స్ ఈఎస్ అనే బ్రిటన్ సంస్థ తయారు చేసింది. అలాగే క్రికెట్‌లో స్నికో మీటర్‌ను పరిచయం చేసింది కూడా బీబీజీ స్పోర్ట్స్ సంస్థే కావడం విశేషం.