Lucknow Super Giants Mentor 2025:టీమ్ఇండియా మాజీ క్రికెటర్ జహీర్‌ఖాన్ కొత్త బాధ్యతలు స్వీకరించాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు మెంటార్‌గా జహీర్ నియమితుడయ్యాడు. ఈ మేరకు లఖ్‌నవూ మేనేజ్‌మెంట్ తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. ఇక 2025 ఐపీఎల్లో లఖ్‌నవూకు జహీర్ మెంటార్‌గా వ్యవహరించడనున్నాడు.
గంబీర్ స్థానంలో జహీర్
సుదీర్ఘ అనుభవం ఉన్న జహీర్ రాక లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టులో కొత్త ఉత్సాహాన్నివ్వడం ఖాయం. ఎందుకంటే గౌతమ్ గంభీర్ మార్గనిర్దేశకత్వంలో లఖ్‌నవూ జట్టు 2022, 2023 ఐపీఎల్ సీజన్లలో ప్లేఆఫ్స్ చేరింది. 2024 సీజన్‌కు ముందు గంభీర్ కేకేఆర్‌కు మెంటార్‌గా వెళ్లిపోవడం వల్ల ఆ ప్రభావం లఖ్‌నవూ టీమ్‌పై పడింది. దీంతో ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో లఖ్‌నవూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. పైగా లఖ్‌నవూకు మొన్నటివరకు బౌలింగ్ కోచ్‌గా ఉన్న మోర్నీ మోర్కెల్ ఇప్పుడు సహాయక సిబ్బందిలో లేడు. మోర్కెల్ ఇటీవల భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ నేపథ్యంలో ఎంతో అనుభవమున్న జహీర్ ఖాన్‌ను లఖ్‌నవూ మెంటార్‌గా ఎంచుకుంది.
పలు హోదాల్లో పనిచేసిన జహీర్
భారత క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా జహీర్ ఖాన్ పేరు పొందాడు. కాగా, టీమ్ఇండియా తరఫున 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20లు ఆడాడు. 2011 వన్డే ప్రపంచకప్ భారత్ గెలవడంలో ఈ ఎడమచేతి వాటం పేసర్ కీలక పాత్ర పోషించాడు. జహీర్‌కు ఐపీఎల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. జహీర్ ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ డేర్ డేవిల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.