Father And Son In Cricket:దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఓ అరుదైన గౌరవం. జాతీయ జట్టులో స్థానం సంపాదించి తనదైన ముద్ర వేయాలంటే దానికి కఠోరమైన శ్రమకు అదృష్టం కూడా తోడు కావాల్సి ఉంటుంది. అయితే రెండు తరాల క్రికెటర్లు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం అంతే తేలికైన విషయం కాదు. కానీ, భారత క్రికెట్‌లో తండ్రి-కుమారులు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించి ఔరా అనిపించారు. అలాంటి వారి గురించి తెలుసుకుందామా...?
పటౌడీల వారసత్వం:నవాబ్ మొహమ్మద్ ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ భారత్ తరపున ఆరు టెస్ట్ మ్యాచులు ఆడాడు. మొదటి మూడు టెస్టులను ఇంగ్లాండ్ తరపున అలీఖాన్ ఆ తర్వాత మూడు టెస్టులను భారత్ తరపున ఆడాడు. 1932-34 సంవత్సరాల మధ్య ఇంగ్లాండ్ తరపున పటౌడీ టెస్టు మ్యాచులు ఆడాడు. ఆ తర్వాత భారత్ జట్టుకు మూడు టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించాడు. పటౌడీ 1946లో ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.
భారత్- ఇంగ్లాండ్ తరపున ఆడిన ఏకైక టెస్ట్ క్రికెటర్‌గా నిలిచాడు. ఇఫ్తికార్ పటౌడీ కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తండ్రి ఘన వారసత్వాన్ని కొనసాగించాడు. అలీ ఖాన్ పటౌడీ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా పని చేశాడు. అతన్ని నవాబ్ ఆఫ్ పటౌడీ జూనియర్ అని పిలుస్తారు. పటౌడీ 46 టెస్టుల్లో 2739 పరుగులు చేశాడు.
అమర్‌నాథ్ ద్వయం:టీమ్ఇండియాలోని దిగ్గజ ఆటగాళ్లలో లాలా అమర్‌నాథ్ ఒకరు. టెస్టు క్రికెట్‌లో తొలి సెంచరీ కొట్టిన ఆటగాడిగా లాలా అమర్‌నాథ్ రికార్డు సృష్టించాడు. 24 టెస్టుల్లో టీమ్ఇండియాకు లాలా అమర్‌నాథ్ ప్రాతినిథ్యం వహించి 878 పరుగులు చేశాడు. లాలా అమర్‌నాథ్ కుమారుడు మోహిందర్ అమర్‌నాథ్ కూడా భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 1983 వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో మోహిందర్ అమర్‌నాథ్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. భారత్ తరపున మోహిందర్ అమర్‌నాథ్ 69 టెస్టులు, 85వన్డేలు ఆడాడు.
వినూ మన్కడ్- అశోక్ మన్కడ్:భారత్ తరఫున 44 టెస్టులకు వినూ మన్కడ్ ప్రాతినిథ్యం వహించాడు. ఇందులో వినూ మన్కడ్ 162 వికెట్లు తీశాడు. వినూ మన్కడ్ కుమారుడు అశోక్ మన్కడ్ కూడా భారత్ తరపున 22 టెస్ట్ మ్యాచ్‌లు, ఒక వన్డే ఆడారు. టెస్టుల్లో 991 పరుగులు చేశాడు. వన్డేలో 44 పరుగులు చేశాడు.