Rohit Sharma Captaincy :టీమ్ఇండియా దిగ్గజం ఎంఎస్ ధోనీ కంటే రోహిత్ శర్మ మంచి కెప్టెన్ అని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. తన సహచరులతో రోహిత్ బాగా కనెక్ట్ అవుతాడని చెప్పుకొచ్చాడు. రోహిత్, ధోనీ తమ జట్టుకు నాయకత్వం వహించే తీరు వేరుగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా, బజ్జీ ఓ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ, ధోనీ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
'టీమ్మేట్స్తో బాగా కనెక్ట్ అవుతాడు'
'రోహిత్ ప్రజల కెప్టెన్. తన సహచరులతో బాగా కనెక్ట్ అవుతాడు. వారికి ఏం కావాలో వెళ్లి అడుగుతాడు. ఈ విషయమే ప్లేయర్లందరిలోకెల్లా రోహిత్‌ను ప్రత్యేక స్థానంలో ఉంచుతుంది. కానీ, ధోని స్టైల్ భిన్నంగా ఉంటుంది. అతడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. తన ఆలోచనలను మౌనంగా సహచరులకు తెలియజేస్తాడు. అందుకే నేను బెస్ట్ కెప్టెన్‌గా రోహిత్‌నే ఎంచుకున్నా. రోహిత్‌కు శత్రువులు లేరు. తన కెరీర్లో హిట్ మ్యాన్ చాలా మంది మంచి స్నేహితులను సంపాదించుకున్నాడు. అలాగే రోహిత్ గురించి ప్రతికూలంగా మాట్లాడే ప్లేయర్స్ లేరు. యువ ఆటగాళ్లంతా రోహిత్ వైపే ఉన్నారు' అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు
చెరో ఐదు ట్రోఫీలతో అదుర్స్
కాగా, ఐపీఎల్లో ఎంఎస్ ధోనీ చెన్నైకి, రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. వీరిద్దరూ తమ జట్లకు ఐదు ట్రోఫీలను అందించి మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్లుగా నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్లో వైట్ బాల్ ఫార్మాట్లో ధోనీ మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్నాడు. కాగా, రోహిత్ సారధ్యంలో టీమ్ఇండియా రీసెంట్గా టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. ఇది కెప్టెన్‌గా రోహిత్‌కు తొలి ఐసీసీ టైటిల్. హిట్ మ్యాన్ నాయకత్వంలోనే టీమ్ఇండియా 2023 వన్డే ప్రపంచ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరింది.