Dattajirao Gaekwad Dies: భారతదేశంలో అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్, మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ (95)కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యల వల్ల గత 12 రోజులుగా బరోడా ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. భారత మాజీ ఓపెనర్, జాతీయ కోచ్ ఔన్షుమాన్ గైక్వాడ్ తండ్రి దత్తాజీరావు గైక్వాడ్. 1952 నుంచి 1961 వరకు ఇండియా తరపున ఆడారు. పలు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించారు.
1952లో కుడి చేతి వాటం ఆటగాడుగా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. భారత్ తరపున దత్తాజీరావు గైక్వాడ్ 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. 1959లో ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి పాలైంది. ఆ తర్వాత పలు మ్యాచ్‌లకు సారథ్యం వహించారు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేశారు. రంజీ ట్రోఫీలో 47.56 సగటు రేటుతో 3,139 పరుగులు చేశారు. అందులో ఏకంగా 14 సెంచరీలు ఉన్నాయి. దత్తాజీరావు గైక్వాడ్ తన చివరి టెస్టును 1961లో పాకిస్థాన్‌పై ఆడారు.
2016లో 87 ఏళ్ల వయసులో మాజీ క్రికెటర్ దీపక్ శోధన్ తర్వాత దేశంలో ఓల్డెస్ట్ టెస్ట్ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నారు. దత్తా గైక్వాడ్ వారసత్వాన్ని ఆయన కుమారుడు అన్షుమన్ కూడా టీమ్ఇండియా తరపున క్రికెట్ ఆడారు. భారత్ తరపున 40 టెస్టులు ఆడి 1,985 పరుగులు చేశారు. అలానే 15 వన్డేలు ఆడి 269 పరుగులు చేశారు.