Cricketers Played For 2 Countries : భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. దాయాదుల పోరును ఇరు దేశాల అభిమానులు మ్యాచ్‌లా కాకుండా ఓ చిన్నపాటి యుద్ధంలా చూస్తారు. ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే క్రికెట్ ప్రపంచం దృష్టంతా ఆ మ్యాచ్‌పైనే ఉంటుంది. అయితే భారత్-పాకిస్థాన్ జట్ల తరపున ఆడిన ఆటగాళ్లు ఉన్నారంటే మీకు నమ్మబుద్ధి కాకపోవచ్చు. కానీ రెండు జట్ల తరుపున ఆడిన ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
అబ్దుల్ హఫీజ్ కర్దార్
అబ్దుల్ హఫీజ్ కర్దాన్‌ను పాకిస్థాన్ క్రికెట్ పితామహుడిగా పిలుస్తుంటారు. భారత్-పాక్ రెండు జట్ల తరపున ఆడిన తొలి ఆటగాడు కూడా ఈయనే కావడం విశేషం. పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్‌గానూ కర్దాన్ వ్యవహరించారు. భారత్ నుంచి పాక్ విడిపోక ముందు టీమ్ఇండియా జట్టులో కర్దాన్ సభ్యుడిగా ఉన్నారు. అయితే విభజన తర్వాత ఆయన పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించారు.
పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఎడమచేతి స్పిన్నర్లలో ఒకరిగా కర్దాన్ గుర్తింపు పొందారు. బ్యాటింగ్‌తోనూ జట్టుకు మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే 1946లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కర్దాన్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. అలా భారత్ తరపున కర్దాన్ మూడు టెస్టులు ఆడారు. ఆ తర్వాత పాక్‌కు వెళ్లి ఆ జట్టు తరపున మొత్తం 23 టెస్టులు ఆడారు. 1958లో పాకిస్థానీ ప్రభుత్వం 'ప్రైడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్' (Pride Of Performance) అవార్డుతో కర్దాన్‌ను సత్కరించింది.