AUS VS IND Kohli Rohith : బోర్డర్ గావస్కర్ ట్రోఫ్రీ 2024-25 సమరం మరో 8 రోజుల్లో ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా - భారత జట్ల మధ్య దాదాపు 30 ఏళ్ల తర్వాత ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. దీంతో ఆసీస్ గడ్డపై బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని మూడోసారి దక్కించుకోవాలనే పట్టుదలతో భారత జట్టు అక్కడికి వెళ్లింది. కానీ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఫామ్‌పై క్రికెట్ ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొంది. గత కొద్ది కాలంగా ఈ ఇద్దరు పెద్దగా ఫామ్‌లో లేరు. అయితే ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్స్ ఇప్పటికే విరాట్ - హిట్‌మ్యాన్ ఫామ్‌పై మైండ్ గేమ్ మొదలు పెట్టారు.
రీసెంట్‌గానే విరాట్ ఫామ్‌పై రికీ పాంటింగ్ స్పందిస్తూ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు కౌంటర్ వేశాడు. ఇప్పుడేమో తాజాగా ఆసీస్ మాజీ క్రికెటర్ కెర్రీ ఓ కీఫె కూడా ఇదే పని చేశాడు. కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే, బ్యాటింగ్‌లో అతడు బలహీనంగా కనిపిస్తున్నాడని కామెంట్లు చేశాడు. హిట్ మ్యాన్‌ను లక్ష్యం చేసుకొని ఆసీస్ బౌలర్లు బౌలింగ్ చేస్తారని పేర్కొన్నాడు.
"హిట్ మ్యాన్ మొదటి టెస్టు మ్యాచ్‌కు మిస్ అవుతాడని సమాచారం అందింది. అతడు టీమ్ ఇండియా కెప్టెన్. అతడు ఎప్పుడు బరిలోకి దిగినా ఆసీస్ బౌలర్లు మిస్సైల్లా దూసుకుపోయి హిట్‌మ్యాన్‌కు అడ్డుకట్ట వేసేందుకు ట్రై చేస్తారు. ఈ సిరీస్ రోహిత్‌కు కష్టంగా మారొచ్చు. విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్. గత కొన్నేళ్లుగా అతడు ఆసీస్‌ను కలవరపెట్టే బ్యాటర్‌గా రాణిస్తున్నారు. కానీ ఇప్పుడు అతడు కాస్త బలహీనంగానే కనిపిస్తున్నాడు. ఈ సిరీస్‌ను విరాట్ ఎలా ముగిస్తాడో చూడాలని ఆసక్తిగా ఉంది. ఒకవేళ అతడు ఆధిపత్యం ప్రదర్శిస్తే, భారత్ విజేతగా నిలవడం ఖాయం" అని కీఫె పేర్కొన్నాడు.