Ashwin England Series : తల్లి అనారోగ్యం కారణంగా మ్యాచ్‌లకు దూరమైన టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్ తిరిగి జట్టులోకి రానున్నట్లు తాజాగా బీసీసీఐ వెల్లడించింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ నాలుగో రోజు ఆటకల్లా అతడు జట్టులోకి రానున్నట్లు పేర్కొంది.
"కుటుంబంలో అత్యవసర పరిస్థితి నెలకొన్న కారణంగా మ్యాచ్‌లకు విరామం తీసుకున్న ఆర్.అశ్విన్ తిరిగి నేడు జట్టుతో కలవనున్న విషయాన్ని చెప్పేందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మ్యాచ్ రెండో రోజు అత్యవసర పరిస్థితుల కారణంగా అతడు జట్టును వీడిన విషయం తెలిసిందే. అశ్విన్ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని జట్టు యాజమాన్యం, ప్లేయర్లు, మీడియా, అభిమానులు అతడికి అండగా నిలిచారు. ఈ కష్ట సమయంలో సహచరులు కూడా సమష్టిగా మద్దతు ఇచ్చారు. అతడికి మేనేజ్‌మెంట్ మైదానంలోకి తిరిగి స్వాగతం పలుకుతోంది" అంటూ బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
Ashwin 500 Wickets Test:ఇటీవలే తాను తీసిన500వ వికెట్ల ఘనతను తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టులో జాక్ క్రాలీని ఔట్ చేసిన అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. దీంతో అశ్విన్ టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొమ్మిదో బౌలర్‌గా నిలిచాడు. ఈ లిస్ట్‌లో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరణ్ 800 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. ఇక భారత్ నుంచి అనిల్ కుంబ్లే (619 వికెట్లు) ఒక్కడే ఆశ్విన్ కంటే ముందున్నాడు.