Ashwin Comments On Hindi Language : ఇటీవలే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా వివాదాల్లోకి చిక్కుకున్నాడు. తన మాటల కారణంగా వార్తల్లోకెక్కాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో హిందీ భాష గురించి ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఇంతకీ అతడు ఏమన్నాడంటే?
అసలేం జరిగిందంటే?
భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల ఒక ప్రైవేట్ కళాశాల స్నాతకోత్సవానికి హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాడు. అయితే తన ప్రసంగాన్ని ఏ భాషలో వినాలనుకుంటున్నారని విద్యార్థులను అడిగాడు. అశ్విన్ మొదట ఇంగ్లిష్‌లో వింటారా అని వారిని అడిగాడు. కానీ వారి నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు. ఆ తర్వాత తమిళంలో మాట్లాడాలా అని అన్నాడు. దానికి అక్కడి స్టూడెంట్స్ అంతా ఎనర్జిటిక్‌గా బదులిచ్చారు. చివరికి హిందీలో మాట్లాడాలా అని అడగ్గా, దానికి విద్యార్థుల నుంచి సమాధానం రాలేదు. అప్పుడు అశ్విన్ 'హిందీ మన జాతీయ భాష కాదు. అధికారిక భాష మాత్రమే' అని అన్నాడు. అయితే ఈ మాటలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.
సోషల్ మీడియాలో చర్చ
మరోసారి అశ్విన్ తన వ్యాఖ్యల కారణంగా చర్చనీయాంశంగా మారాడు.అశ్విన్ ప్రకటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. హిందీ భాషపై అశ్విన్ చేసిన కామెంట్లపై మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది అశ్విన్ వ్యాఖ్యలను సమర్థించగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇంకొందరు అశ్విన్ మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.