Ashwin About Retirement : అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినందుకు తనకు ఎలాంటి బాధ లేదని, గత రెండేళ్లుగా కెరీర్ అనుకున్నట్లు సాగలేదని టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. బోర్డర్- గావస్కర్ సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టి అశ్విన్ అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అయితే ఇలా భారత జట్టుకు గుడ్‌బై చెప్పి ఆస్ట్రేలియా నుంచి పయనమైన అశ్విన్ గురువారం చెన్నైకి చేరుకున్నాడు. అక్కడ తన ఇంట్లో అతడికి వెలక్మ్ చెప్పేందుకు వచ్చిన అభిమానులు, సన్నిహితులను చూసి ఎమోషనలయ్యాడు. దీంతో వచ్చిన వెంటనే తల్లిదండ్రులు, భార్యా పిల్లలను హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యాడు.
"ఎంతోమందికి ఇది (రిటైర్మెంట్) ఓ ఎమోషన్. దాన్ని నెమ్మదిగానే జీర్ణించుకుంటారు. కానీ నాకు మాత్రం ఈ రిటైర్మెంట్ ఎంతో సంతృప్తి అలాగే ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఇది చాలా నేచురల్ విషయమే. గత కొంతకాలంగా నా బుర్రలో తిరుగుతూనే ఉంది. కానీ నాలుగో రోజు నేను (మూడో టెస్టు) రిటైరవ్వాలని నిర్ణయించుకున్నా. అందుకే మ్యాచ్ ముగిశాక ఆ విషయాన్ని అనౌన్స్ చేశాను. ఇదేం అంత పెద్ద నిర్ణయం కాదు. ఎందుకంటే నేను కొత్త మార్గంలో నడవనున్నాను. నిజంగా చెప్పాలంటే మన కెరీర్లో ఎన్నో చూస్తాం. సాధారణంగా నేను నిద్రపోయే ముందు వికెట్లు తీయడం, పరుగులు చేయడం లాంటివి నాకు బాగా గుర్తుకొచ్చేవి. కానీ గత రెండేళ్లుగా అటువంటి జ్ఞాపకాలేం లేవు. విభిన్నమైన మార్గాన్ని ఎంచుకునేందుకు అదే స్పష్టమైన సంకేతంగా అనిపించింది. ప్రస్తుతం ఇంకా కొత్త లక్ష్యాలేమీ నిర్దేశించుకోలేదు. ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఆటకు దూరంగా ఉండటం కష్టమే. కానీ నేను ప్రయత్నిస్తాను. ఓ క్రికెటర్‌గా నాలో ఆ జ్వాల ఇంకా రగులుతూనే ఉంది. అందుకే చెన్నై సూపర్ కింగ్స్‌కు వీలైనంత ఎక్కువ కాలం ఆడాలనే కోరిక నాకు ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. ఇక క్రికెటర్‌గా అశ్విన్ పనైపోలేదు. భారత క్రికెటర్‌గా మాత్రమే ముగించాను అంతే" అని అశ్విన్ పేర్కొన్నాడు.