Ambati Rayudu Rohit Sharma IPL:2024 ఐపీఎల్‌కు సమయం దగ్గర పడుతోంది. మరో 11 రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఇకఆయా ఆటగాళ్లు తమతమ ఫ్రాంచైజీ క్యాంప్‌ల్లో చేరి ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మారితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
2025లో ఐపీఎల్ మెగా వేలం ఉండనుంది. అందులో ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్‌ను వదిలేసి హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌ను రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. దీంతో వచ్చే ఏడాది ధోనీ రిటైరైతే, రోహిత్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మారాలని సూచించాడు.
'రోహిత్ చాలాకాలం నుంచి ముంబయికి ఆడుతున్నాడు. ఇంకో 5-6 ఏళ్లపాటు క్రికెట్ ఆడగలడు. ఒకవేళ ధోనీకి ఇదే లాస్ట్ ఐపీఎల్ అయితే, 2025 నుంచి రోహిత్ చెన్నై జట్టుకు ఆడాలని కోరుకుంటున్నా. అతడు చెన్నైకి ఆడితే బాగుంటుంది. అక్కడ అతడికి ఈజీగానే కెప్టెన్సీ లభిస్తుంది' అని రాయుడు ఓ సందర్భంలో అన్నాడు.