2024 Year Cricket Highlights : 2024వ సంవత్సరం కొద్ది రోజుల్లోనే పూర్తి కాబోతోంది. ఈ ఏడాది సగటు భారత క్రికెట్ అభిమానికి ఎలా గడిచిందో చెప్పాలంటే ఓ సందర్భం గుర్తు చేసుకుంటే సరిపోతుంది. అందరూ భారత్ 2024 వరల్డ్ కప్ గెలిచిన సంతోషంలో ఉన్నారు, మ్యాచ్‌లో కీ మూమెంట్స్‌ని చర్చించుకుంటున్నారు. అప్పుడు హఠాత్తుగా ఓ పిడుగు లాంటి వార్త. రోహిత్, కోహ్లి, జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఈ వార్తని ఆ సమయంలో జర్ణించుకోవడం టీమ్‌ఇండియా ఫ్యాన్స్‌కి కష్టమైంది.
2024కి కూడా అలానే సాగింది. ఓ భారీ విజయం, ఊహించని పతనం. ఇలా వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ఏడాదిలో కనిపించే కీలక అంశాలు ఇవే.
టీ20 ప్రపంచకప్ విజయం
దశాబ్దాల నిరీక్షణ తర్వాత భారత్ 2024 టీ20 ప్రపంచకప్ ట్రోఫీ గెలిచింది. యూఎస్‌ఏ, వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్లింది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా అత్యధిక వికెట్లు తీశారు.
ఐపీఎల్ విజేత కోల్‌కతా
2024 ఐపీఎల్ కప్పుని కోల్‌కతా నైట్ రైడర్స్ నెగ్గింది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ మూడో టైటిల్ సొంతం చేసుకుంది. ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. కేకేఆర్ తరఫున సునీల్ నరైన్ అత్యధిక పరుగులు చేయగా, వరుణ్ చక్రవర్తి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
పంత్ రికార్డు
2025 మెగా వేలంలో మరో రికార్డు క్రియేట్ అయింది. రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అతడిని లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రికార్డు స్థాయిలో రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది.
ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్
భారత్ ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత, గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించాడు. ఐపీఎల్‌లో కేకేఆర్ కోచ్‌గా సక్సెస్ అయిన గంభీర్‌కి ఈ అవకాశం లభించింది.
క్రికెట్ దిగ్గజాల రిటైర్మెంట్
2024లో చాలా మంది స్టార్ ప్లేయర్లు రిటైర్మెంట్ తీసుకున్నారు. భారత దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20కి గుడ్ బై చెప్పేశారు. రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొన్నాడు. ఇంకా డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్), టిమ్ సౌథీ (టెస్టులు, న్యూజిలాండ్) నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్), మొయిన్ అలీ (ఇంగ్లండ్), దినేష్ కార్తీక్ (భారత్), హెన్రిచ్ క్లాసెన్ (టెస్టులు, దక్షిణాఫ్రికా) కూడా ఆయా ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికారు.