తెలంగాణ

telangana

ఏరువాక పౌర్ణమి అంటే ఏంటి? ఆరోజేం చేస్తారు? విదేశాల్లో కూడా!! - Eruvaka Pournami 2024

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 3:28 PM IST

What Is Eruvaka Pournami : సాధారణంగా మనం మత సంబంధమైన పండుగలు, జాతీయ పండుగలు, పూజలు, నోములు, వ్రతాలు వంటివి ఎన్నో చేసుకుంటూ ఉంటాము. కానీ రైతులకు మాత్రమే ప్రత్యేకమైన ఓ పండుగ ఉంది. ఆ పండుగ విశేషాలేమిటో? అది ఎలా జరుపుకోవాలో? ఇప్పుడు తెలుసుకుందాం

ERUVAKA POURNAMI 2024
ERUVAKA POURNAMI 2024 (ETV Bharat)

What Is Eruvaka Pournami : భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. దేశ ప్రగతి మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే మన దేశంలో ఎన్నటికీ రైతే రాజు. అలాంటి అన్నదాతలకు ప్రత్యేకమైన పండుగ ఒకటుంది. అదే ఏరువాక పౌర్ణమి. ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజును మనం ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా ఏరువాక పౌర్ణమి విశేషాలను తెలుసుకుందాం.

అసలేమిటీ ఏరువాక పౌర్ణమి?
రోళ్లు పగిలే రోహిణి కార్తె వెళ్లి, తొలకరి చినుకులను తెచ్చే మృగశిర కార్తె రాకను స్వాగతిస్తూ జరుపుకునేదే ఏరువాక పౌర్ణమి. వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఎద్దులను, నాగలిని పూజించి దుక్కి దున్నడం ప్రారంభించేవారని ఈ పండుగ గురించి ఋగ్వేదంలో వివరించారు.

కర్షకుల పండుగ
ఏరువాక పౌర్ణమి సహజంగా కర్షకుల పండుగ. భూదేవిని నమ్ముకొని పంటలు పండించే రైతులు వర్ష ఋతువు ఆరంభంలో తొలకరి చినుకు కోసం ప్రార్ధిస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఏరువాక పౌర్ణమి రోజును వేడుకగా జరుపుకుంటారు.

ఏరువాక పూజ ఇలా!
ఈ రోజున మట్టిని నమ్మి కష్టించి పని చేసే రైతులు భూమి పట్ల, సమస్త ప్రకృతి పట్ల తన భక్తి ప్రపత్తులు చాటుకుంటూ ఉదయాన్నే ఎడ్లను కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి, రకరకాల గజ్జెలు, గంటలు, పూసల దండలతో, పూల దండలతో ఎద్దులను సర్వాంగసుందరంగా అలంకరించి, పొంగలి ప్రసాదాలతో, మంగళ వాయిద్యాలతో పొలాలకు ఊరేగింపుగా వెళ్లి అంగరంగ వైభవంగా పొలం దున్నడం ప్రారంభిస్తారు.

గోగునార తోరణాలు
అదే రోజు సాయంత్రం గ్రామంలో ఊరి ముంగిట గోగు నారతో చేసిన తోరణాలను కడతారు. ఈ తోరణాల మధ్యలో అక్కడక్కడా జిలేబీలు, గారెలు, కరెన్సీ కాగితాలు ఎత్తులో కడతారు. దీనినే ఏరువాక తోరణం అని అంటారు. రైతులు తమ తమ పశువులను ఈ ఏరువాక తోరణం కిందుగా పరుగులు పెట్టిస్తారు. అప్పుడు వారు ఏరువాక తోరణం నుంచి తమకు దొరికిన వాటిని తీసుకెళ్తారు. దీనిని వారు అత్యంత పవిత్రంగా భావించి తమ పొలాల్లో, ధాన్యాగారంలో దాచి ఉంచుతారు. అలా చేయడం వల్ల పంటలు సమృద్ధిగా పండి కరువు ఉండదని రైతుల విశ్వాసం. యూరప్ వంటి విదేశాలలో కూడా మే పాన్ అనే పేరుతో ఈ ఏరువాక పూర్ణమిని జరుపుకుంటారు.

వృక్షో రక్షతి రక్షితః
మానవ జీవితమే ప్రకృతి ప్రసాదం. ప్రకృతి మీద ఆధారపడి జీవించే మానవుడు ప్రకృతి రక్షించాలి, వర్షాలు కురవడం కోసం చెట్లను పెంచాలి. ప్రకృతి ఆగ్రహిస్తే ప్రళయం తప్పదు. కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోతారు. అందుకే ప్రకృతిని పరిరక్షించుకోవడం మన బాధ్యత. ప్రకృతిని మనం రక్షిస్తే అదే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది.

మనందరి పండుగ
ఏరువాక పౌర్ణమి పండుగ ఒక్క అన్నదాతకు మాత్రమే కాదు. మనందరికీ పండుగే! ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశమంటే మనమందరం కదా! అందుకే ఈ పండుగ మనందరికీ కూడా పండుగే! ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని పంటలు బాగా పండాలని దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరం ఏరువాక పౌర్ణమి పండుగను ఆనందంగా జరుపుకుందాం. అన్నదాతలందరికి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. సర్వేజనా సుఖినోభవంతు. లోకాసమస్తా సుఖినోభవంతు!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details